తెలంగాణ ముఖ్యాంశాలు

పిల్లల జన్మదినం రోజున మొక్కలు నాటాలిః మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో 12వ గ్రాండ్‌ నర్సరీ మేళాను గురువారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ నెల 22 వరకు నర్సరీ మేళా కొనసాగనుండగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 140పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేళాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోంగార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచివేదిక అన్నారు. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి వచ్చాయన్నారు. చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి.. వారిని స్మరించుకోవాలని మంత్రి అన్నారు.

సీఎం కేసీఆర్ ఆలోచనతో తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఇంత మొత్తంలో ఎక్కడా జరగటం లేదని, రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతానికి పచ్చదనం 7.6 శాతం పెరిగి 31.6 శాతానికి చేరిందని.. ఇవి కేంద్రం చెప్పిన లెక్కలన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మొక్కల పెంపకమని చెప్పారన్నారు.

అడవులను పునరుజ్జీవం చేశారని, ఈ నెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని, అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నానన్నారు. పిల్లల జన్మదినం రోజున మొక్కలు నాటాలని.. పిల్లలతో కలిసి మొక్కలను పెంచాలన్నారు. పచ్చదనం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చక్కటి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందేందుకు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలన్నారు. పిల్లలకు మనమేమిచ్చినా ఇవ్వకపోయినా.. మంచి వాతావరణం, మంచి ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/