టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు భారీ భద్రత నడుమ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రతను డబుల్ చేసింది. 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా.. ఆ ఆదేశాలకు అనుగుణంగా.. ఎన్‌ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత పెంపు తక్షణమే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం 12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న జరిగిన ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడో రోజు చంద్రబాబు పర్యటనలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు గతంలో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత ఉంటే.. ఈసారి నుంచి డీఐజీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో సెక్యూరిటీ ఉండనుంది. మూడో రోజు బాబు పర్యటన కృష్ణ నందనపల్లి, గుండ్ల నాయన పల్లి, కొత్తూరు మీదుగా కొనసాగుతుంది. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు.
మరోపక్క కుప్పంలో నిన్న వైస్సార్సీపీ శ్రేణులు చేసిన విధ్వసాన్ని ఖండిస్తూ టీడీపీ విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా పాల్గొన్నారు. జగన్ రివర్స్ పాలనకు సూచికగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి తలకిందులుగా శీర్షాసనం వేశారు. జగన్ పాలన పోవాలి.. చంద్రబాబు పాలన రావాలి అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/