ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. సముద్రమట్టానికి ఇది 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పారు.

ఇక వర్షం సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం వరకు భారీ వర్షాలు పడ్డాయి. పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, ధర్మవరంలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/