తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణ లో పాదయాత్ర ఫై రాహుల్ ను మార్పులు కోరిన టి కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 07 నుండి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,500 కిలోమీటర్లకుపైగా సాగనుంది. కేరళలో 19 రోజులు, కర్ణాటకలో 21 రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టనున్నారు.

12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా సుమారు 300-350 కిలోమీటర్ల మేర సాగనుంది. రాయచూర్‌ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్‌ యాత్ర కొడంగల్, పరిగి, వికారా­బాద్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్‌ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్ తయారుచేశారు. అయితే ఇప్పుడు ఈ పాదయాత్ర లో కొన్ని మార్పులు చేయాలనీ టి కాంగ్రెస్ నేతలు రాహుల్ ను కోరారు.

రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాలను కవర్ చేసేలా రూట్‌ను మార్చాల్సిందిగా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. హైదరాబాద్ శివారు ప్రాంతాల మీదుగా కొన్ని ముఖ్యమైన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను టచ్ చేసేలా మార్పులు చేస్తే పార్టీకి కలిసొస్తుందని, హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు సంగారెడ్డి జిల్లాను కవర్ చేసేలా పాదయాత్ర చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే తెలంగాణలో పాదయాత్ర రూట్‌‌మ్యాప్ మార్పులతో ఇతర రాష్ట్రాల షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేతల రిక్వెస్ట్‌పై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/