విశాఖపట్నం స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తానన్న చంద్రబాబు
త్వరలో ఏపిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిడిపి తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ స్థానానికి కంచర్ల శ్రీకాంత్ అభ్యర్థిత్వాలను చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నం స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇకపై ఏ ఎన్నిక జరిగినా టిడిపి పోటీ అనివార్యమని చెప్పిన చంద్రబాబు… గెలుపే ధ్యేయంగా పోరాటం సాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను పరిశీలించుకుంటూ ఉండాలన్న చంద్రబాబు.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వైఎస్‌ఆర్‌సిపి వారు దొంగ ఓట్లను చేరుస్తారన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/