అంతర్జాతీయం

వైద్య సాయం కావాలి..శ్రీలంక అధ్యక్షుడికి నిత్యానంద లేఖ

ఖర్చునంతా తామే భరిస్తామని హామీ

ఆధ్యాత్మికవేత్త నిత్యానంద శ్రీలంక ను శరణాగతి కోరారు. తనకు అత్యవసర వైద్యసాయం అవసరమని, ఆశ్రయం కల్పించాలని వేడుకుంటూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాశారు. ఈ లేఖ ఆగస్ట్ 7వ తేదీతో ఉంది. నిత్యానంద స్వామి విదేశాలకు పారిపోయి, శ్రీ కైలాస (స్వయంగా పెట్టుకున్న పేరు) అనే దీవిలో ఉంటున్న విషయం తెలిసిందే. తన దీవిలో వైద్య సదుపాయాల లేమిని లేఖలో నిత్యానంద ప్రస్తావించారు. తీవ్ర అనారోగ్యంతో అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నట్టు వివరించారు. ఈ లేఖను నిత్యానంద తరఫున శ్రీకైలాస విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి రాశారు. స్థానికంగా ఉన్న వైద్య సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకున్నా ఫలితం లేదని, అనారోగ్యానికి కారణమేంటన్నది వైద్యులు తెలుసుకోలేకపోతున్నారని వివరించారు.

రాజకీయ ఆశ్రయాన్ని వెంటనే మంజూరు చేయాలని, దాంతో ఎయిర్ అంబులెన్స్ లో వెంటనే తరలిస్తామని చెప్పారు. అనంతరం శ్రీలంకలో సురక్షిత ప్రదేశంలో వైద్య చికిత్స తీసుకుంటారని పేర్కొన్నారు. ఇందుకు అయ్యే వ్యయాలను తాము భరిస్తామని చెప్పారు. ఎంత ఖరీదైనా సరే వైద్య ఉపకరణాలను తాము కొనుగోలు చేసుకుంటామని, చికిత్స తర్వాత వాటిని శ్రీలంక కోసం విడిచి వెళతామని తెలిపారు. రద్దు చేయలేని రాజకీయ ఆశ్రయం మంజూరు చేస్తే శ్రీలంకలో స్వామి పెట్టుబడులు కూడా పెడతారని హామీ ఇచ్చారు. నిత్యానంద అత్యాచార కేసును ఎదుర్కొంటున్నారు. 2010లో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత విదేశానికి మకాం మార్చారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/