అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని రైతులు నిర్ణయించారు. వేకువ జామున 5 గంటలకు పాదయాత్ర మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు.
ముందుగా వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానికి జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తప్ప మిగతా పార్టీలను ఆహ్వానించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులను ఆహ్వానించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. యాత్ర తొలి రోజు వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేవారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో అందజేశారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/