ఆమె ఎస్సీ కాదంటూ ఇటీవల ముంబయి హైకోర్టు తీర్పు
మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఆమె గత ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు, నవనీత్ కౌర్ ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీనిపై నవనీత్ కౌర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం. అయితే, నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, ఆమె ఎస్సీ కాదని శివసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ విచారణ జరిపి, నవనీత్ కౌర్ మోసపూరితమైన రీతిలో కల్పిత పత్రాలను సమర్పించినట్టు అభిప్రాయపడింది. ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది.