హైదరాబాద్ వనస్థలిపురంలోని సుబ్బయ్యగారి హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్‌లో మంటలు చేలరేగినట్లు తెలిసింది. హోటల్ మూడో అంతస్తులో 40 మంది సిబ్బంది చిక్కుకోగా..పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో సంభవించిన అగ్నిప్రమాదాల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా.. హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోటలైన సుబ్బయ్యగారి హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హోటల్ రెండో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసి పడిన మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో మెుత్తం 40 మంది సిబ్బంది ఉన్నారు. వారు మూడో అంతస్తులో చిక్కుకుపోగా.. సమాచారం అందుకున్న హయత్ నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, వనస్థలిపురం పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మూడో అంతస్తులో చిక్కుకున్న 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటల దాటికి హోటల్‌లోని ఫర్నీచర్ మెుత్తం కాలిబూడిదయ్యింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకోవటం, ఆ సమయంలో హోటల్‌లో సిబ్బంది తప్ప కస్టమర్లు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
ఇక సుబ్బయ్యగారి హోటల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కాకినాడ వెళితే సుబ్బయ్యగారి హోటల్‌లో భోజనం చేసి తీరాల్సిందేనని ఫుడ్ లవర్స్ అంటూ ఉంటారు. అటువంటి సుబ్బయ్యగారి హోటల్‌కు హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. నగరంలో వనస్థలిపురం, కూకట్‌పల్లి, మలక్‌పేట, కొండాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో వారి బ్రాంచీలు ఉన్నాయి. ఈ హోటల్‌లో అరిటాకులో 12 నుంచి 16 రకాల వంటకాలతో భోజనం వడ్డిస్తారు.