శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్… మరోసారి వార్తల్లో నిలిచారు. ఆందోళన చేస్తున్న జనసేన నేతలుపై విరుచుకుపడిన ఆమె.. ఓ నేత రెండు చెంపలపై కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన నేతలు ప్రయత్నించారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని సీఐ అంజు యాదవ్ జనసేన నేతలకు తేల్చిచెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి యత్నించడంతో పలువురు నేతలను శ్రీకాళహస్తి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది జనసేన నేతలు పోలీసుల కళ్లుగప్పి పెళ్లిమండపం కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ విరుచుపడ్డారు. జనసేన నేత రెండు చెంపలపై కొట్టారు. సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపైనా ఆమె దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. సీఐ ప్రవర్తన చర్చనీయాంశమైంది. జనసేన నేతపై సీఐ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. సీఐ తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తిలో నిరసన చేస్తున్న జనసేన నేత కొట్టే సాయిని చెంప దెబ్బలు కొట్టిన సీఐ అంజు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ విషయం ముదరక ముందే వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్న సీఐను సస్పెండ్ చేసి విచారించాలని ఆయన కోరారు.