ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీతో ఇన్నాళ్లు పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు తీరా కేంద్రమంత్రి నుంచి ఆఫర్ వస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పేశారు.
ఏపీలో బీజేపీకి టీడీపీ అండగా నిలవాలంటూ తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీతో పొత్తు కోసం నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న టీడీపీకి వరంగా మారాయి. అయితే ఇవాళ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించనంటూనే స్పందించిన చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరో మాట్లాడిన దానిపై స్పందించి చులకన కాదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తద్వారా దీనిపై మాట్లాడాల్సిన వాళ్లు మాట్లాడితే స్పందిస్తాననే సంకేతాలిచ్చారు.
మరోవైపు ఏపీలో వాలంటీర్ల వ్యవస్ధపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఏం చేస్తారో చంద్రబాబు చెప్పేశారు. వాలంటీర్లు ప్రజాసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యంచేసుకుంటామంటే కుదరదని చంద్రబాబు తేల్చేశారు. వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు సేకరించడం ద్రోహమన్నారు. దీంతో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ప్రజాసేవకే పరిమితం చేస్తామన్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికలకు తన అజెండా ఏంటో కూడా చంద్రబాబు చెప్పేశారు. దగా పడ్డ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలు కూడా ఉండాలని, పోరాడితే కేంద్రమైనా దిగొస్తుందనడానికి జల్లికట్టు వ్యవహారమే నిదర్శనమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తద్వారా అవసరమైతే కేంద్రంపై పోరాటానికి కూడా రెడీ అనే సంకేతాలు ఇచ్చేశారు.