భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు జులై 13న బయల్దేరి వెళ్లనున్నారు.
‘బాస్టీల్ డే’ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఫ్రాన్స్ నుంచి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది.
ఈ వేడుకలకు భారత ప్రధానిని ఫ్రాన్స్ ఆహ్వానించడం ఇది రెండోసారి.
2009లో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం అనంతరం రెండు దేశాల నాయకుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వీటిలో సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలతో మొదలుపెట్టి యుక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై చర్చ జరిగే అవకాశముంది.
భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలు ఎంత దృఢమైనవి?
‘బాస్టీల్ డే’ వేడుకలకు మళ్లీ మళ్లీ భారతీయ నాయకులను ఆహ్వానించడాన్ని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో తెలుస్తుంది.
భారత్ స్వాతంత్ర్యం తర్వాత నాలుగు దశాబ్దాల వరకూ యూరప్‌లో భారత్‌కు అత్యంత సన్నిహిత భాగస్వామిగా బ్రిటిన్ కొనసాగేది. కానీ, గత మూడు దశాబ్దాల్లో ఆ స్థానంలోకి ఫ్రాన్స్ వచ్చింది. రెండు దేశాల మధ్య సంబంధాలు పెనవేసుకుపోవడమే దీనికి కారణం.
1998లో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం రెండు దేశాల సంబంధాలను మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. గత 25 ఏళ్లుగా రెండు దేశాల బంధాలకు ఈ ఒప్పందం దిక్సూచీలా మారింది.
ఈ ఒప్పందం తర్వాత, 1998లోనే రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత్ అణ్వస్త్రాలను పరీక్షించింది. వెంటనే దాదాపు అన్ని పశ్చిమ దేశాలూ భారత్‌పై ఆంక్షలు విధించాయి. కానీ, ఆ దేశాల జాబితాలో ఫ్రాన్స్ లేదు.
అంతేకాదు, ఆ ఆంక్షల ప్రభావం నుంచి భారత్ బయటకు వచ్చేందుకు కూడా ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది.
ఆ తర్వాత కూడా భారత్‌కు కొన్నిరకాల ఆయుధాలను విక్రయించకుండా కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పుడు కూడా భారత్‌కు ఫ్రాన్స్ మద్దతుగా నిలిచింది.
అందుకే గత 25 ఏళ్లలో విమానాల నుంచి జలాంతర్గాముల వరకూ భిన్న రకాల రక్షణ ఉత్పత్తులను భారత్‌కు విక్రయించే రెండో అతిపెద్ద దేశంగా ఫ్రాన్స్ మారింది.
ఏ అంశాలు చర్చకు రావచ్చు?
ప్రస్తుత పర్యటనలో భారత నౌకా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ ప్రకటన చేసే అవకాశముంది.
విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారు.
వీటితోపాటు రక్షణ రంగంలో మరికొన్ని ఒప్పందాలు కూడా రెండు దేశాలూ కుదుర్చుకునే అవకాశముంది. వీటిలోనే ‘టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్’ కూడా ఒకటి.
అయితే, భారత్‌కు ఫ్రాన్స్ విక్రయించాలని భావిస్తున్న రక్షణ ఉత్పత్తుల జాబితా చాలా పెద్దదే ఉంది. స్కార్పీన్ జలాంతర్గాముల కోసం మళ్లీ ఆర్డరు పెట్టాలని భారత్‌ను ఫ్రాన్స్ అడుగుతోంది.
ఇదివరకటి ఒప్పందంలో భాగంగా ముంబయిలోని మజ్‌గావ్ డాక్స్‌లో ఆరు జలాంతర్గాములను తయారుచేస్తున్నారు. వీటిలో ఐదు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఎయిర్‌బస్ హెలికాప్టర్ల సంస్థ నుంచి నౌకా దళం కోసం ఎన్‌హెచ్90 హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయాలని ఫ్రాన్స్ కోరుతోంది.
మహారాష్ట్రలోని ప్రతిపాదిత జైతాపుర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కోసం ఈపీఆర్ రియాక్టర్‌పైనా ఒప్పందం కుదుర్చుకోవాలని ఫ్రాన్స్ అడుగుతోంది.
దీనికి సంబంధించి 15 ఏళ్ల క్రితం రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కానీ, ధర, భద్రత విషయంలో కొన్ని అవరోధాలు ఎదురుకావడంతో చర్చలు మధ్యలోనే నిలిచిపోయాయి.
సంబంధిత ఫ్రాన్స్ కంపెనీ ‘ఈడీఎఫ్’ స్వదేశంలో కనీసం ఒక్క రియాక్టర్ కూడా విజయవంతంగా నెలకొల్పకపోవడమూ చర్చలు నిలిచిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. మరోవైపు దీని కోసం నిర్దేశించిన తుది గడువు కూడా పూర్తై దశాబ్దం గడిచింది.
వ్యూహాత్మక అంశాల్లో ఏం చర్చిస్తారు?
రక్షణ ఒప్పందాలతోపాటు కొన్ని వ్యూహాత్మక అంశాలు కూడా ఫ్రాన్స్, భారత్ మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.
వీటిలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యం ముఖ్యమైనది. ఇక్కడి అంతర్జాతీయ జలాల్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యంపై రెండు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి.
దక్షిణాసియాలో పరిస్థితిపై కూడా భారత్, ఫ్రాన్స్ నాయకులు చర్చించే అవకాశముంది. దీనిలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఉంటాయి.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రస్తావించొచ్చు. ఆంక్షల విషయంలో పశ్చిమ దేశాలతో కలిసి పనిచేయనప్పటికీ.. కనీసం రష్యా నుంచి చమురు దిగుమతులనైనా తగ్గించాలని ఆయన భారత్‌ను అడగొచ్చు.
సెప్టెంబరులో దిల్లీలో జరగబోయే జీ-20 సదస్సు నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను దూరంగా పెట్టాలని ప్రధాని మోదీకి మెక్రాన్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంకేతాలు ఇవ్వొచ్చు.
రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు సన్నిహితంగానే ఉన్నాయి. భారత సంస్కృతి, వారసత్వ సంపదపై ఫ్రెంచ్ ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ యోగా, ఆయుర్వేద ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
భారతీయ సాహిత్యం, సంగీతం, నృత్యాలు, సినిమాలకు కూడా ఫ్రాన్స్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. కాస్త ఘాటుగా ఉండేటప్పటికీ ఫ్రాన్స్‌లో భారత వంటకాలూ ఫేమస్సే.
అదే సమయంలో ఫ్రెంచ్ సంస్కృతికి భారత్‌లోనూ ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో విదేశీ భాషలు నేర్చుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫ్రెంచ్‌కు మొగ్గు చూపుతున్నారు.
భారత్‌లోని చాలా విదేశీ భాషా స్కూల్స్, యూనివర్సిటీల్లో ఫ్రెంచ్‌ను నేర్పిస్తున్నారు.
ఫ్రెంచ్ భాష, ఫ్రాన్స్ సంస్కృతులను విదేశాల్లో ప్రోత్సహించేందుకు ఫ్రాన్స్ మొదలుపెట్టిన ‘అలయన్స్ ఫ్రాంచైస్’కు భారత్‌లోనే ఎక్కువ బ్రాంచ్‌లు ఉన్నాయి.
ఫ్రాన్స్‌కు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో ఈ సంఖ్య పది రెట్లకుపైనే పెరిగింది.
వాతావరణ మార్పులపైనా చర్చిస్తారా?
వాతావరణ మార్పులు, ప్రపంచ వాణిజ్య మార్గాలు తదితర అంశాలపైనా ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
వాతావరణ మార్పుల విషయానికి వస్తే, రెండు దేశాలు చాలా అంశాలపై కలిసి పనిచేస్తున్నాయి. అయితే, కొన్ని అంశాల్లో విభేదాలు కూడా ఉన్నాయి.
సోలార్ ఎనర్జీ టెక్నాలజీని ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా భారత్, ఫ్రాన్స్ కలిసి 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ను మొదలుపెట్టాయి.
గత 8 ఏళ్లలో సోలార్ ఎనర్జీ టెక్నాలజీతో కర్బన ఉద్గారాలు తగ్గించుకునేందుకు ఆర్థికంగా బలహీనమైన దేశాలకు ఈ కూటమి సాయం చేస్తోంది.
అయితే, అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 100 బిలియన్ల డాలర్లు (రూ.8.24 లక్షల కోట్లు) ఇచ్చే అంశంపై రెండు దేశాలకూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
మరోవైపు వాణిజ్యం విషయంలోనూ రెండు దేశాలూ ఒకే తాటిపై లేవు.
ప్రపంచ వాణిజ్య సంస్థలోని చాలా అంశాలపై రెండు దేశాలూ ఒక్కోసారి భిన్నమైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో పేటెంట్లు, మార్కెట్ యాక్సెస్, వ్యవసాయం తదితర అంశాలున్నాయి.
వాణిజ్య బంధాలు ఎంత దృఢమైనవి?
భారత్-ఫ్రాన్స్‌ల మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నప్పటికీ, వాణిజ్యంలో అది కనిపించడం లేదు.
2010 నుంచి 2021 మధ్య రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 4 బిలియన్ డాలర్లు (రూ.32.97 వేల కోట్లు) మాత్రమే పెరిగింది.
2010లో ఫ్రాన్స్‌తో భారత్ వాణిజ్యం 9 బిలియన్ డాలర్లు (రూ.74.18 వేల కోట్లు)గా ఉండేది. 2021నాటికి 13 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)కు మాత్రమే పెరిగింది.
అదే సమయంలో ఇతర దేశాలతో భారత్ వాణిజ్యం గణనీయంగా పెరిగింది.
చైనాతో సరిహద్దుల్లో ఘర్షణలు ఉన్నప్పటికీ భారత్ వాణిజ్యం 2010లో 58 బిలియన్ డాలర్ల (రూ.4.78 లక్షల కోట్లు) నుంచి 2021 నాటికి 117 బిలియన్ డాలర్ల(రూ9.64 లక్షల కోట్లు)కు పెరిగింది.
అలానే అమెరికాతో భారత్ వాణిజ్యం 2010లో 45 బిలియన్ డాలర్లు(రూ.3.70 లక్షల కోట్లు)గా ఉండేది. 2021 నాటికి ఇది 110 బిలియన్ డాలర్ల(రూ.9.06 లక్షల కోట్లు)కు పెరిగింది.
అమెరికా, చైనా లాంటి పెద్ద దేశాలతోనే కాదు జర్మనీతోనూ ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగింది. 2010లో 19 బిలియన్ డాలర్లు(రూ1.56 లక్షల కోట్లు)గా ఉండే ఇది.. 2021 నాటికి 27 బిలియన్ డాలర్ల(2.22 లక్షల కోట్లు)కు పెరిగింది.
భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధాల్లో రక్షణ రంగ ఒప్పందాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మెట్రో రైలు నుంచి లోకో మోటివ్‌ల వరకూ భారత్ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటోంది.
వీటిని ద్వైపాక్షిక వాణిజ్యం నుంచి తొలగిస్తే, వాణిజ్యం పూర్తిగా పడిపోతుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఇతర వాణిజ్య సంబంధాలు అంతలా వేళ్లూనుకోలేదు. ఈ విషయంలో రెండు దేశాలూ పూర్తిగా విఫలం అయ్యాయి.
ముఖ్యంగా ఎదుటి దేశంలోని వాణిజ్యంపై రెండు దేశాల్లోని కంపెనీల్లోనూ చాలా అనుమానాలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పారిస్‌లో మోదీ, మెక్రాన్ చర్చలు జరుపబోతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత వేళ్లూనుకునేలా వీరు చర్చల్లో దృష్టిసారించాలి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకూ ఈ బంధాల్లో చోటు కల్పించాలి.