వీధి కుక్కలు చిన్నారుల పాలిట మృత్యు దేవతలుగా మారుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల దాడిలో గతంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన ఘటన అందరూ మనసులను కలచివేసింది.
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాజీవ్ గృహకల్ప వద్ద నివసించే పోలెపాక మచ్చాస్ కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమారులు. వరంగల్ నగర పాలక సంస్థలో వాటర్ మాన్ గా పనిచేస్తున్న మచ్చాస్ కుటుంబంతో కలిసి రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నాడు. గత నెల 17వ తేదీన ఇంటిముందు ఆడుకుంటున్న అతని చిన్న కుమారుడైన డేవిడ్ రాజు ను వీధి కుక్కలు కరిచాయి.
వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గత 26 రోజుల నుండి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు నిన్న మరణించాడు.దీంతో బాలుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. కాగా గత మే నెలలో కాజీపేట రైల్వే కాలనీలో వీధి కుక్కలు బాలుడి పై దాడి చేయగా బాలుడు మృతి చెందాడు.
బీహార్ కు చెందిన ఓ సంచార జాతికి చెందిన కుటుంబం పొట్ట చేతపట్టుకుని బతుకుతెరువు కోసం కాజీపేట కు వచ్చారు. అయితే అక్కడ ఆడుకుంటున్న బాలుడి పై రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన 108 సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాలుడు మరణించాడు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ వీధి కుక్కల విషయంలో చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం, వరంగల్ నగరపాలక సంస్థ వైఫల్యం చెందుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వీధి కుక్కలను నివారించాలని, అధికార యంత్రాంగం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.