కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ధరణిని తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చింది. కానీ, అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అన్నట్టు ధరణి మాటున జరిగిన కబ్జాలు కోకొల్లలు. ధరణి వచ్చాకే లిటిగేషన్ భూములకు రెక్కలొచ్చాయి. చాలా ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమోయ్ కుమార్, ధరణి పేరుతో సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో మరోసారి ధరణిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఈడీకి అమోయ్ అప్రూవర్‌గా మారినట్టు సమాచారం. ఇదే నిజమైతే, కేసీఆర్ ఫ్యామిలీకి, బడా కంపెనీలకు ఈడీ సెగ తగిలే ఛాన్స్ ఉంటుంది. దీపావళి సందర్భంగా పొలిటికల్ బాంబులు పేలతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, ధరణి, అమోయ్ రూపంలో బాంబ్ పేలనుందని అంతా అనుకుంటున్నారు.భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ ఉన్న సమయంలో జరిగిన ఈ భూ స్కాం వెనుక చాలా తతంగం నడిచింది. తాను రూల్ ప్రకారమే అంతా చేశానని అమోయ్ అంటుండగా, అతని ఆస్తులు, లావాదేవీలపై గుచ్చి గుచ్చి అధికారులు ప్రశ్నించడంతో, అప్రూవర్‌గా మారినట్టుగా సమాచారం. అందుకే మూడు రోజులపాటు విచారణ జరిగినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన వివరాల్ని, ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయొచ్చు. కానీ, అమోయ్ చిట్టా చాలా పెద్దగా ఉండడంతో, ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారనే అంశంలో కూపీ లాగేందుకే ఈడీ సుదీర్ఘ విచారణ జరిపిందని, ఈ క్రమంలోనే అమోయ్ అప్రూవర్‌గా మారినట్టుగా తెలుస్తోంది.కేసీఆర్ ప్రభుత్వంలో భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో భూముల పందేరం కొనసాగింది. లిటిగేషన్ భూముల కబ్జాలు, బెదిరింపులు ఎక్కువయ్యాయి.
అదే సమయంలో ధరణి పేరుతో దర్జాగా బడా కంపెనీలకు భూములు అధికారంగా, అనధికారికంగా చేరాయి. దీని వెనుక అమోయ్ కీలక పాత్ర పోషించారు. ఇష్టం వచ్చినట్టు అప్రూవల్ ఇచ్చేసి చాలామందిని ముంచేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. దీంతో ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీని కేటీఆర్, కవిత, సంతోష్, హరీష్ రావు రంగారెడ్డి జిల్లా భూముల వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినట్టు ప్రచారం ఉంది. ఇప్పుడు అమోయ్ అప్రూవర్ అయితే వీరందరికీ ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, బడా కంపెనీలకు కూడా ఈడీ సెగ తగలడం ఖాయం.విచారణ సందర్భంగా వందల ప్రశ్నలు వేశారు ఈడీ అధికారులు. ముందు ఎంత కవర్ చేసుకున్నా, తర్వాత అమోయ్ ఓపెన్ కావాల్సి వచ్చింది. గోపాన్‌పల్లి భూ వ్యవహారాలు, బినామీల రూపంలో ఉన్న నగదుపై ఈడీ ఫోకస్ చేసింది. దానికి సంబంధించిన వివరాలతో గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. అంతేకాదు, అమోయ్ ఆస్తుల చిట్టాను కూడా అతని ముందు ఉంచి, ఆనాడు జరిగిన నగదు లావాదేవీలపై వివరాలు అడిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చేసేదేం లేక అమోయ్ అప్రూవర్ అయినట్టుగా తెలుస్తోంది.
ఎలాంటి ఆస్తులు అటాచ్ మెంట్ చేయకుండా, తనను ఇబ్బంది పెట్టకుండా, తాను నామమాత్రంగా ఉన్నానని, అందరికీ లబ్ధి చేకూర్చి తాను ఎలాంటి తప్పు చేయలేదని ఈడీ ముందు వాపోయిన అమోయ్, పూర్తి సహకారం అందిస్తానని చెప్పినట్టుగా సమాచారం.ఓవైపు అమోయ్‌ని ఈడీ విచారిస్తుండగా, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మరో అధికారి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. హస్తినలో లాబీయింగ్ చేస్తూ కేసును తమ వైపు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరిద్దరూ భూముల వ్యవహారాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్టుగా ఆరోపణలున్నాయి. అమోయ్‌ను వెనుకుండి నడిపించారని, అతను నోరు విప్పితే, తమకు చిక్కులు తప్పవని లాబీయింగ్‌లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఈడీ వారి దాకా వెళ్తే గత ప్రభుత్వ పెద్దలకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.