రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జులై 20 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. 2023-24 విద్యాసంవత్సారానికి చేపట్టిన ప్రవేశాల్లో బాలుర కంటే బాలికకే అధిక సీట్లు..
రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు జులై 20 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. 2023-24 విద్యాసంవత్సారానికి చేపట్టిన ప్రవేశాల్లో బాలుర కంటే బాలికకే అధిక సీట్లు లభించాయి. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం.. నాలుగు క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతంతో కలిపి 4,400 సీట్లు ఉన్నాయి. వీటిలో బాలికలకు 2,585 సీట్లు, బాలురు 1,455 సీట్లు పొందారు. అంటే మొత్తం సీట్లలో బాలికలకు 64 శాతం లభించాయి. ఈ మేరకు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన వారి వివరాలు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం (జులై 13) విడుదల చేశారు. మొత్తం సీట్లలో 360 సీట్లు దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్, సైనికోద్యోగుల కోటా కింద కేటాయించారు.
కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 23,628, ప్రైవేటు బడులకు చెందిన 14,727మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,345 (82.79%), ప్రైవేటు నుంచి 695 (17.20%) మంది సీట్లు పొందారు. ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
కౌన్సెలింగ్ వివరాలు..
- సీట్లు పొందిన అభ్యర్థులకు క్యాంపస్‌లను కేటాయించేందుకు జులై 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
- నూజివీడులో జులై 20 నుంచి 21 వరకు
- ఇడుపులపాయలో 21 నుంచి 22 వరకు
- ఒంగోలులో జులై 24 నుంచి 25 వరకు
- శ్రీకాకుళం ఎచ్చెర్లలో జులై 24 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు
- సైనికోద్యోగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్ కోటాలోని 360 సీట్లకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు
- ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయి