haryana-mla
జాతీయం రాజకీయం

ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన మహిళ.. వీడియో వైరల్

సాధారణంగా తమ నియోజక వర్గ ప్రజలను కలిసేందుకు ప్రజా ప్రతినిధులు అప్పుడప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు. ఇక ఏవైనా ఆపదలు వచ్చినపుడు తోడుగా ఉన్నామని.. వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలను కలిసి మాట్లాడతారు. ఇలాగే ఓ ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ఉన్న ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలో అక్కడ ఉన్న ఓ మహిళ.. ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించింది. ఇంతకీ ఎందుకు కొట్టింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రధానాంశాలు:

  • ఎమ్మెల్యే చెంపపై కొట్టిన మహిళ
  • నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

ఒక ఎమ్మెల్యే అంటే ఆయనకు భద్రత ఉంటుంది. బాడీగార్డ్‌లే కాకుండా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఆయా పరిధిలోకి వచ్చే పోలీసులు కూడా ఎమ్మెల్యే వెంట.. భద్రతగా ఉంటారు. అలాంటి భద్రత మధ్య ఉన్న ఓ ఎమ్మెల్యేపై.. ఒక మహిళ దాడి చేసింది. పోలీసులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు చూస్తుండగానే.. ఎమ్మెల్యే చెంపను చెల్లుమనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్య పోయారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

అసలు ఏమైంది
ఉత్తర భారత దేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాల్లో కుంభ వృష్టి కురుస్తోంది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హర్యానాలో లోతట్టు ప్రాంతాల్లో అవస్థలు పడుతున్న ప్రజలను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ఊహించని పరిణామం ఎదురైంది. కైతాల్ జిల్లాలోని తన నియోజకవర్గంలో జననాయక జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్.. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ చుట్టూ గుమిగూడారు. తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. ఇంతలో ఆ గుంపులో నుంచి వచ్చిన ఓ మహిళ.. ఈశ్వర్ సింగ్ చెంపపై కొట్టింది.

ఎందుకు కొట్టింది
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హర్యానాలో భారీగా నష్టం సంభవించింది. చాలా మంది తమ ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆహారం లేక రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో ఈశ్వర్ సింగ్ తన నియోజకవర్గంలో ఉన్న ప్రజల పరిస్థితిని పరామర్శించేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావడంతో అక్కడ ఉన్న వారంతా తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆయన చుట్టూ చేరారు. వర్షాలు పడి అవస్థలు పడుతుంటే ఇన్ని రోజుల తర్వాత వస్తారా అంటూ స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. వరదలతో అల్లాడుతుంటే ఏ ప్రజా ప్రతినిధి కూడా తమ గోడు పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఆ జనాల నుంచి వచ్చిన ఓ మహిళ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ చెంపపై కొట్టింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని ఆ మహిళను అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా స్థానికులు తీసిన వీడియోల్లో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

స్పందించిన ఎమ్మెల్యే
అయితే ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ స్పందించారు. మహిళ చేసిన పనికి ఆమెను క్షమించినట్లు మీడియాకు వెల్లడించారు. సదరు మహిళపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇచ్చారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడి.. ఆ కోపాన్ని ఆ మహిళ చూపించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అటు.. హర్యానాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వాటి ద్వారా వచ్చిన వరదలకు 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. మరిన్ని వర్షాలు కూడా పడే అవకాశం ఉందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం వెల్లడించారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు హర్యానా ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది.