img-2
క్రీడలు జాతీయం

యశస్వి జైస్వాల్: క్రికెట్ కోసం ఇంటి నుంచి పారిపోయాడు, ఇప్పుడు తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు

ఒక్క టెస్టు మ్యాచ్‌తోనే భారత క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరు భారత క్రికెట్ అభిమానుల్లో మారుమోగుతోంది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీని పక్కనబెట్టి మరీ అందరూ యశస్వి సెంచరీ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఆడిన తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేయడంతో అందరి దృష్టీ అతడిపైనే.

ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 143 పరుగులతో అజేయంగా నిలిచి డబుల్ సెంచరీ వైపు కదులుతున్నాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అనుభవజ్ఞుడైన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మొదటి బౌండరీ కొట్టడానికి 80 బంతులు తీసుకున్నాడు.

ఎన్నో ఏళ్లుగా టెస్టు క్రికెట్ ఆడుతున్న కోహ్లి ఇంత ఆచితూచి ఆడుతుండగా, తాను ఆడిన తొలి టెస్టులోనే 21 ఏళ్ల యశస్వీ భూపేంద్ర కుమార్ జైస్వాల్ సెంచరీ చేసి తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు.

భారత తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ 350 బంతుల్లో 14 ఫోర్లతో అజేయంగా 143 పరుగులు చేశాడు.

ఓపెనర్‌గా తొలి టెస్టులోనే సంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు.

వెస్టిండీస్‌తో తొలి టెస్టు జరుగుతున్న డొమినికా పిచ్ స్లోగా ఉండటంతో పాటు బౌలర్లకు టర్న్‌ను, బౌన్స్‌ను అందించింది. మరోవైపు అవుట్‌ఫీల్డ్ మరింత నెమ్మదించింది.

ఒకానొక సందర్భంలో మైదానంలోని స్టంప్ మైక్‌లో యశస్వి మాటలు బయటకు వినిపించాయి.

‘‘బంతి బాగా సాఫ్ట్‌గా మారింది. ఎంత గట్టిగా ప్రయత్నించినా అది చురుగ్గా కదలట్లేదు’’ అని యశస్వీ అన్నట్లు క్రిక్ ఇన్ఫోతో భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా అన్నారు.

ఎంత ప్రయత్నించినా బంతి కదలకపోవడం అనేది చాలా విసుగెత్తించే అంశం. అయినప్పటికీ యశస్వి సహనాన్ని, ఓపికను కోల్పోకుండా నిగ్రహంగా బంతుల్ని ఎదుర్కొన్నాడు.

మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు.

వీరిద్దరూ సెంచరీలు చేయడంతో భారత్ రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 113 ఓవర్లలో 2 వికెట్లకు 312 పరుగులు చేసింది.

శుభ్‌మన్ గిల్ (6) త్వరగానే అవుటయ్యాడు.

విరాట్ కోహ్లి 96 బంతుల్లో 1 ఫోర్‌తో అజేయంగా 36 పరుగులు చేశాడు.

చిన్న విషయం కాదు

ప్రస్తుతం వెస్టిండీస్ బౌలింగ్‌లో మునుపడి అంత వాడి లేకపోవచ్చు.

1970-1980 కాలంలో ఉన్నట్లుగా అరివీర భయంకర బౌలర్లు ఉండకపోవచ్చు.

కానీ, తొలి టెస్టులోనే ఒక యువ ఆటగాడు సెంచరీ సాధించడం, దాన్ని డబుల్ సెంచరీగా మలిచే దిశగా తీసుకెళ్తుండటం చిన్న విషయమేమీ కాదు.

పైగా, ఈ టెస్టు మ్యాచ్ జరగుతోన్న డొమినికాలో సెంచరీ చేయడం అనుభవజ్ఞులకు సాధారణమే. కానీ, అరంగేట్ర ఆటగాడు సులభంగా సెంచరీ చేయగలిగే పరిస్థితులు ఇక్కడ ఉంటాయని మాత్రం చెప్పలేం.

ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ ఓపిక, సహనాన్ని ప్రదర్శిస్తూ జైస్వాల్ ఇక్కడ సెంచరీని తన పేర రాసుకున్నాడు.

అడుగు పెడితే సెంచరీలు..

యశస్వి జైస్వాల్ గురించి మరో ఆసక్తికర అంశం చెప్పుకోవాలి.

ఎరుపు బంతి క్రికెట్ టోర్నీల్లో అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీలు చేయడం అనే అనవాయితీని అతను కొనసాగిస్తున్నాడు.

ఎందుకంటే గతంలో దులీప్ ట్రోఫీ, భారత్ ‘ఎ’, ఇరానీ కప్ టోర్నీల్లో భాగంగా తాను ఆడిన తొలి మ్యాచ్‌‌లలోనే యశస్వి సెంచరీలు నమోదు చేశాడు.

ఇప్పుడు టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రంలో కూడా అదే పునరావృతం చేశాడు.

దులీప్ ట్రోఫీ టోర్నీలో భాగంగా 2022 సెప్టెంబర్‌లో నార్త్‌జోన్‌తో మ్యాచ్‌లో వెస్ట్‌జోన్ తరఫున యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేశాడు.

ఆ మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.

వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 321 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్లతో 228 పరుగులు చేశాడు.

రెండు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం యశస్వీకి దక్కింది.

తర్వాత 2022 డిసెంబర్‌లో భారత ‘ఎ’, బంగ్లాదేశ్ ‘ఎ’ జట్ల మధ్య కాక్స్ బజార్‌లో అనధికార టెస్ట్ మ్యాచ్ జరిగింది.

అప్పుడే భారత ‘ఎ’ జట్టులోకి యశస్వీ జైస్వాల్ అరంగేట్రం చేశాడు.

ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 112 పరుగులకు ఆలౌటైంది. తర్వాత భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ 226 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్‌తో 146 పరుగులు చేశాడు.

అభిమన్యు ఈశ్వరన్ కూడా 141 పరుగులు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లు కోల్పోయి 465 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

తర్వాత ఈ మ్యాచ్ కూడా డ్రా అయింది.

ఇటీవల అంటే 2023 మార్చి నెలలో జరిగిన ఇరానీ కప్ ట్రోఫీలో కూడా యశస్వీ ఇలాంటి ఘనతే సాధించాడు.

ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు యశస్వీ ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు కూడా డబుల్ సెంచరీ చేసి ‘‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’’గా నిలిచాడు.

మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ 259 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 213 పరుగులు చేశాడు.

తాజాగా టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి దూసుకుపోతున్నాడు.

మెరుగ్గా ఫస్ట్ క్లాస్ గణాంకాలు

టీమిండియా క్యాప్ అందుకోకముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యశస్వి అద్భుత గణాంకాలు నమోదు చేశాడు.

అతను 80.21 సగటుతో పరుగులు సాధించాడు.

ఫస్ట్ క్లాస్‌లో ఆడిన మొత్తం 26 ఇన్నింగ్స్‌లలో 11 అర్ధసెంచరీలు చేశాడు. వాటిలో తొమ్మిది అర్ధసెంచరీలను సెంచరీలుగా మలిచాడు.

మొత్తం 15 మ్యాచ్‌ల్లో 1,845 పరుగులు చేశాడు. 265 అత్యధిక స్కోరు

ఇల్లు వదిలి వచ్చి… టెంట్‌ కింద బతికాడు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి పదేళ్ల వయస్సులోనే క్రికెటర్ కావాలనే ఆశయంతో ఇల్లు వదిలి ముంబయికి వచ్చేశాడు.

క్రికెట్ ఆడాలంటే ముంబయి వెళ్లాలని తన సీనియర్లు చెప్పిన మాటలే తన బుర్రలో ముద్రపడిపోయాయని ఒక పాడ్‌కాస్ట్‌లో యశస్వి చెప్పాడు.

ముంబయిలోని ప్రపంచ ప్రఖ్యాత అజాద్ మైదానంలో రోజంతా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు.

ఇల్లు వదిలేశాక ముంబయిలో బతకడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు.

డెయిరీ ఉత్పత్తులు విక్రయించే ఒక షాపులో పనిచేశాడు. కానీ, రోజంతా క్రికెట్ ఆడి అలసిపోయి పనిపై దృష్టిపెట్టలేకపోవడంతో యజమాని అతడిని పనిలో నుంచి తీసేశాడు.

”కనీసం ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వండి” అని ప్రాథేయపడ్డానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు యశస్వి. అవి చాలా కష్టాలుపడిన రోజులని చెప్పాడు.

”ఆ మరుసటి రోజు నా కోచ్‌కు ఫోన్ చేశాను. ఆయన వాళ్లింటికి వచ్చేయమనడంతో అక్కడ రెండు మూడు నెలలు ఉన్నాన”ని చెప్పాడు యశస్వి.

ఆ తరువాత క్రికెట్ క్లబ్‌లో గ్రౌండ్‌మెన్‌తో కలిసి ఒక టెంట్‌లో ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు.

”మా టెంట్‌లో ఉండాలంటే స్కోర్‌ వేయాలి అని వారు చెప్పారు.. అది నాకు బాగానే అనిపించింది. అక్కడే ఉంటే పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేసుకోగలను.. స్కోర్ వేయగలను, అంపైరింగ్ చేయగలను.. ఆ డబ్బు నాకు బతకడానికి పనికొస్తుందనుకున్నాను” అని చెప్పాడు.

వీధుల్లో తినుబండారాల అమ్మకం

తన సంపాదన పెంచుకోవడం కోసం యశస్వి పండగల సమయంలో వీధుల్లో తినుబండారాలు విక్రయించేవాడు.

కానీ, ఆటగాడిగా మంచి ఆహారం తీసుకోవడానికి అతనికి అవకాశం ఉండేది కాదు. అన్నం, పిండి, బంగాళదుంపలు తినేవాడు.. వారానికొక్క రోజు ఆదివారం చికెన్ తినేవాడు.

”ఆదివారాల కోసం వేచి చూసేవాడిని” అని యశస్వి గుర్తు చేసుకున్నాడు. తాను కలిసి నివసించే గ్రౌండ్‌మెన్‌తో తిండి కోసం పోరాడే కంటే ఏమీ తినకుండా నిద్రపోయేవాడు చాలాసార్లు.

1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిని గట్టిగా వాటేసుకోవాలని ఆయనకు ఎన్నోసార్లు అనిపించినా భావోద్వేగాలు బలహీనతలుగా మారుతాయని అనిపించి ఆ ఆలోచనలను దగ్గరకు రానిచ్చేవాడు కాదు.

”అమ్మ గుర్తొచ్చినప్పుడంతా ఏడుపొచ్చేది. నేను పడుతున్న కష్టాలు ఇంట్లో చెప్పేవాడిని కాను. నాకు తెలుసు.. నేను ఇబ్బంది పడుతున్నానని చెబితే ఇంటికి వచ్చేయమంటారు”

అజాద్ మైదాన్‌లో తన కంటే పెద్దవాళ్లు, సీనియర్లు బౌలింగ్ చేస్తుంటే సునాయాసంగా ఆడుతున్న యశస్విని చూసి ఆయనలో ప్రతిభను గుర్తించిన జ్వాలా సింగ్ అప్పటి నుంచి ఆయనకు తర్ఫీదు ఇచ్చారు.

అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడం.. దేశవాళీ వన్డే క్రికెట్‌లో 71 పరుగుల సగటు ఉండడంతో ఐపీఎల్‌లో యశస్వికి డిమాండ్ ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్ అతడితో ఒప్పందం చేసుకుంది.

17 ఏళ్ల వయసులో ముంబయి తరఫున ఆడుతూ 154 బంతుల్లో 203 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

2023 ఐపీఎల్ సీజన్‌లో యశస్వి 174.60 స్ట్రయిక్ రేట్‌తో 625 పరుగులు సాధించాడు.