ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. సదరు మహిళను చండివాలి నహారే అమృత్ శక్తి నివాస్‌కు చెందిన రేష్మ ట్రెంచిల్‌గా గుర్తించారు. ఆమె భర్త శరత్ మే 23న కరోనా బారినపడి మృతి చెందారు. అతను ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పని చేశారు. రేష్మ వద్ద సూసైడ్ నోట్ ఆధారంగా పొరుగింటి వారిపై సకినాకా పోలీస్‌స్టేషన్‌లో సుమోటో కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఆమె భర్తతో కలిసి ఏప్రిల్ 10న కొత్త అద్దె అపార్ట్‌మెంట్‌లోకి మారారు. అప్పటి నుంచి పొరింటి వారితో గొడవలు మొదలయ్యాయి.
రేష్మ కొడుకు ఆడుకుంటున్న సమయంలో ఎక్కువ శబ్దాలు చేయడంతో పొరుగున ఉంటున్న కుటుంబం సొసైటీకి ఫిర్యాదు చేశారు. అనంతరం రేష్మ భర్త శరత్ యూపీలోని వారణాసికి వెళ్లి కరోనా బారినపడిన తన తల్లిదండ్రులకు సేవలందించాడు. ఆ తర్వాత శరత్ కరోనా బారినపడి మరణించాడు. ఈ క్రమంలోనే రేష్మ తనయుడు గరుడ్ ఆడుకుంటున్న సమయంలో చప్పుడు చేస్తున్నారంటూ మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే, మేలో రెండు కుటుంబాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు పిలిచామని, బాధితురాలు రేష్మా పొరుగు వారిపై మానసిక వేధింపుల ఆరోపణలు చేసిందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితురాలి కొడుకుపై కుటుంబం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.