జాతీయం రాజకీయం

అటల్ బిహారీ వాజ్‌పేయి- ఇందిరా గాంధీ: ఈ ఇద్దరు ‘శక్తిమంతమైన’ నాయకుల మధ్య మాటల యుద్ధం ఎలా ఉండేది? వీరి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి?

అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆయన మిత్రుడు అప్పా ఘటాటే 1977 ఎన్నికల సందర్భంలో ఒక ప్రశ్న అడిగారు.

‘‘ప్రజలను మొరార్జీ దేశాయ్ పేరుతో ఓట్లు అడుగుతారా’’ అని వాజ్‌పేయిని ఆయన ప్రశ్నించారు.

‘‘ఎందుకు, నేను నా పేరు మీదే ఓట్లు సంపాదిస్తాను’’ అని వాజ్‌పేయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బదులిచ్చారు.

జనతా పార్టీలో జేపీ తర్వాత తన మాట వినేందుకే ఎక్కువ మంది జనం వస్తారని ఆయనకు బాగా తెలుసు.

1977 ఫిబ్రవరి 7న దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్ష నేతల తెల్లటి అంబాసిడర్ కార్లు వచ్చి నిలబడ్డాయి. అందులో వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది వృద్ధులు. వాళ్లు మెల్లగా మెట్లు ఎక్కి వేదికపైకి చేరుకున్నారు.

వారంతా ఒక్కొక్కరుగా తమకు జైల్లో జరిగిన అన్యాయాల గురించి అక్కడ ఉన్న ప్రజలకు వివరించారు. నేతలంతా ఒకే రకంగా ప్రసంగిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వింటూనే ఉన్నారు.

దాదాపు తొమ్మిదిన్నర గంటలకు అటల్ బిహారీ వాజ్‌పేయి వంతు వచ్చింది.

ఆయన్ను చూడగానే జనాలంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వాజ్‌పేయి మెల్లగా నవ్వుతూ తన రెండు చేతులను పైకెత్తి వాళ్లను నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు.

తర్వాత ఆయన కళ్ళు మూసుకుని ఒక కవితను మొదలుపెటారు. “బడీ ముద్దత్ కే బాద్ మిలే హై దీవానే” అనే వాక్యం చదివి కాస్త ‘పాజ్’ ఇచ్చారు. వెంటనే ప్రజలంతా కేరింతలు కొట్టారు.

వెంటనే, ఆయన ప్రేక్షకులకు ప్రశాంతంగా ఉండాలనే సంకేతం ఇస్తూనే, “కెహ్నే సున్నే కో బహుత్ హై అఫ్సానే” అంటూ మరో వాక్యం చెప్పారు. ఈసారి చప్పట్లు మారు మోగాయి.

మళ్లీ కళ్ళు మూసుకుని కవిత చివరి పంక్తి అయిన “ఖులీ హవా మే జరా సాస్ తో లే లే, కబ్ తక్ రహేగీ ఆజాదీ కౌన్ జానే” అని ఆయన నోటినుంచి వెలువడడానే జనంలో ఉత్సాహం ఉరకలెత్తింది.

అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో 1 సఫ్దర్‌జంగ్ రోడ్ నివాసంలో ఉన్న ఇందిరా గాంధీకి, తన ఓటమికి వాజ్‌పేయి పునాది వేశారనే సంగతి అప్పటికి తెలియదు.

బ్యాంకుల జాతీయీకరణ సమస్య

1966లో ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రామ్ మనోహర్ లోహియా ఆమెను ‘మూగ బొమ్మ (గూంగీ గుడియా)’ అని ఎగతాళి చేశారు.

కానీ, ఏడాదిలోపే ఇందిరా గాంధీ ఆ పేరును చెరిపేసుకుని ప్రతిపక్షాల దాడులకు తనదైన శైలిలో సమాధానం చెప్పడం మొదలుపెట్టారు.

ఇందిరా గాంధీ ఆర్థిక విధానాలు, జనసంఘ్ శిబిరంలో విభేదాలు సృష్టించాయి.

భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు, జనసంఘ్ రాజ్యసభ ఎంపీ అయిన దత్తోపంత్ థెంగడి బ్యాంకుల జాతీయీకరణకు అనుకూలంగా ప్రతిపాదనను సమర్పించారు.

తమ పార్టీ 1967 ఎన్నికల మేనిఫెస్టో, బ్యాంకుల జాతీయీకరణను వ్యతిరేకిస్తోందని పేర్కొంటూ పార్టీ సీనియర్ నాయకుడు బల్‌రాజ్ మధోక్ దాన్ని వ్యతిరేకించారు.

మధోక్ తన ఆత్మకథ ‘జిందగీ కా సఫర్’ మూడో భాగంలో ఇలా రాశారు. “బ్యాంకుల గురించి థెంగడి చేసిన ప్రతిపాదనకు ఆర్‌ఎస్‌ఎస్ ఆశీర్వాదం ఉందని నాకు చెప్పడానికి లంచ్ సమయంలో వాజ్‌పేయి వచ్చాడు” అని రాసుకొచ్చాడు.

రచయిత అభిషేక్ చౌదరీ రాసిన ‘వాజ్‌పేయి ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924-1977’ అనే పుస్తకం ఇటీవల విడుదలైంది.

“వాజ్‌పేయి మొదట పార్లమెంట్‌లో బ్యాంకుల జాతీయీకరణను ప్రజా వ్యతిరేక చర్యగా విమర్శించారు. అయితే, వెంటనే ఈ చర్యకు ప్రజాదరణ లభిస్తోందని ఆయన గుర్తించారు.

ఉత్తర భారత్‌లోని జనసంఘ్ అనుకూల వ్యాపార వర్గం కూడా బ్యాంకుల రుణ విధానాల మార్పు వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని గ్రహించింది” అని ఆ పుస్తకంలో రాశారు.

జనసంఘ్ వార్తాపత్రిక ఆర్గనైజర్ 1969 ఆగస్టు 23 సంచికలో ఇలా రాసింది.

“బ్యాంకుల జాతీయీకరణపై ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజకీయపరమైనదేనని, ఆర్థికపరమైనది కాదని వాజ్‌పేయి విశ్వసించారు. ఒక విధంగా అది అధికారంలో కొనసాగడానికి ఒక ఆయుధం లాంటిదని అనుకున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా వెళ్లడం తెలివైన పనిగా వాజ్‌పేయి భావించలేదు” అని సంచికలో పేర్కొన్నారు.

రాజభరణం విషయంలో ఇందిరా గాంధీతో ఘర్షణ

వాజ్‌పేయి, ఇందిరా గాంధీల మధ్య తొలి ఘర్షణ రాజభరణం విషయంలో జరిగింది. మాజీ రాజులకు ఇచ్చే ప్రభుత్వ భత్యానికి సంబంధించినది ఈ ఘర్షణ.

1969 సెప్టెంబరు 1న రాజులకు రాజభరణం ఇవ్వకూడదనే బిల్లును లోక్‌సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించింది.

కానీ, మూడు రోజుల తర్వాత ఈ బిల్లు ఒక్క ఓటు తేడాతో రాజ్యసభలో వీగిపోయింది. కానీ, ఇందిరా గాంధీ మౌనంగా కూర్చోలేదు.

ఆమె సెప్టెంబర్ 5న ఆర్డినెన్స్ ద్వారా రాజులకిచ్చే రాజభరణాన్ని రద్దు చేశారు.

ఇది పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానించడమేనని వాజ్‌పేయి అభివర్ణించారు.

రాజభరణం విషయంలో ఇందిరా గాంధీకి ప్రజల మద్దతు ఉందని తెలిసి కూడా వాజ్‌పేయి ఆమెను ఎందుకు వ్యతిరేకించారని నేను అభిషేక్ చౌదరిని అడిగాను.

“ఇతర రాజుల కారణంగానే జనసంఘ్ రాజమాత సింధియా రాజభరణం తొలగించడాన్ని వ్యతిరేకించింది. విజయరాజే సింధియా కుమారుడు మాధవరావు సింధియా 1970 ఫిబ్రవరిలో గ్వాలియర్‌లో జనసంఘ్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో వాజ్‌పేయి కూడా ఉన్నారు’’ అని చెప్పారు.

ఈ నిర్ణయం మధ్యప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయితే ఇక్కడ గ్వాలియర్ దర్బారు రాజకీయ ప్రభావాన్ని కూడా విస్మరించలేమని చౌదరి తెలిపారు.

రాజభరణంపై రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, చట్టవిరుద్ధమని డిసెంబరు 15న సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించింది.

వాజ్‌పేయి కోర్టు తీర్పును ప్రభుత్వానికి చెంపదెబ్బగా అభివర్ణించారు.

ఇందిరా గాంధీపై మాటల తూటాలు

1971 ఎన్నికల ప్రచారంలో ఇందిరపై వాజ్‌పేయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రధానమంత్రి, భారత ప్రజాస్వామ్యంలో పవిత్రమైన వాటన్నింటికీ శత్రువు’’ అని అన్నారు.

“తాను బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థిని తన పార్టీనే వ్యతిరేకించడంతో ఆమె ఏకంగా పార్టీనే చీల్చారు. రాజభరణం రద్దు బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకపోవడంతో ఆర్డినెన్స్‌ తెచ్చారు.

ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్ట్ తీర్పునివ్వడంతో ఆమె లోక్‌సభను రద్దు చేశారు.

ఒకవేళ ‘లేడీ డిక్టేటర్’కు అవకాశం వస్తే, సుప్రీంకోర్టును కూడా రద్దు చేస్తారేమో’’ అని ఇందిరా గాంధీపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

తనకు మూమూలు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సీటు బుక్ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతుంటే, ప్రధాని తన ప్రచారానికి ఐఏఎఫ్ విమానాలను ఉపయోగిస్తున్నారని వాజ్‌పేయి ఫిర్యాదు చేశారు. పైగా తాను బుక్ చేసుకున్న విమానాలు అంతుచిక్కని కారణాల వల్ల గంటల తరబడి ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయని చెప్పారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా దిల్లీలోని బోట్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వాజ్‌పేయి ప్రసంగిస్తున్నప్పుడు, పై నుంచి వెళ్తున్న రెండు సీట్లు ఉన్న పసుపు రంగు విమానంలో నుంచి కరపత్రాలను జారవిడిచారు.

అభిషేక్ చౌదరి దీని గురించి రాస్తూ, “ఇది ప్రధానమంత్రి పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పథకం. వాజ్‌పేయి కిందపడుతున్న కరపత్రాలను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడుతూ, ‘ఆ కరపత్రాలను గాల్లోనే ఎగరనివ్వండి. నేను మీ ఓట్ల కోసం వచ్చాను’ అని అన్నట్లు చౌదరి రాశారు.

కానీ, ఆ విమానం అక్కడి నుంచి వెళ్లిపోకుండా అక్కడక్కడే మొత్తం 23 సార్లు చక్కర్లు కొట్టింది. విమానం ద్వారా అలా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని వాజ్‌పేయి అన్నారు.

కరపత్రాలను కిందకు జారవిడుస్తున్న విమానాన్ని చూస్తూ, ‘‘ఇది ప్రజాస్వామ్యమేనా?’’ అని ప్రశ్నించారు.

1971 యుద్ధంలో ఇందిరా గాంధీకి మద్దతు

వాజ్‌పేయి అంచనాను 1971 ఎన్నికల ఫలితాలు పూర్తిగా తప్పు అని తేల్చాయి.

ఎన్నికల్లో గౌరవప్రదంగా ఓడిపోతామని ఆయన ఆశించారు. కానీ, ఆశించిన దానికి విరుద్ధంగా మహాఘట్‌బంధన్‌కు 49 సీట్లు మాత్రమే దక్కాయి. జనసంఘ్ సంఖ్య 35 నుంచి 22కి పడిపోయింది. వాటిలో ఎక్కువ సీట్లు మాజీ రాజుల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చాయి.

హిందీ మాట్లాడే మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీ కేవలం 7 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

డిసెంబర్ 4న పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయాలని 1971 నవంబర్‌లో ఇందిర నిర్ణయించారు. అయితే, పాకిస్తాన్ ఒకరోజు ముందుగానే భారత వైమానిక స్థావరాలపై దాడి చేయడం ప్రారంభించింది.

ఆ తర్వాత రెండు వారాలపాటు వాజ్‌పేయి పార్లమెంటరీ కార్యక్రమాలకు హాజరవుతూ, దిల్లీలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ గడిపారు.

ఈ సందర్భంగా ఆయన ‘‘ఇందిరాజీ ఇప్పుడు జనసంఘ్ విధానాలను అనుసరిస్తున్నారు’’ అనే ఆసక్తికరమైన ప్రకటన చేశారు.

అదే సమయంలో, యుద్ధ సన్నాహాలలో ప్రభుత్వానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు.

భద్రతా మండలిలో అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనను సోవియట్ యూనియన్ వీటో చేసినప్పుడు, వాజ్‌పేయి యూటర్న్ తీసుకుంటూ సోవియట్ యూనియన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

‘‘సంక్షోభ సమయంలో మనకు అండగా నిలిచే దేశం ఏదైనా మన మిత్రదేశమే అవుతుంది. సైద్ధాంతిక పోరాటాలను తర్వాత చేసుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.

ఇందిరకు మద్దతుగా వాజ్‌పేయి మాట్లాడుతూ, ” యాహ్యా ఖాన్‌కు ఇందిరా గాంధీ గుణపాఠం నేర్పుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఒక మతతత్వ దేశాన్ని నాశనం చేయడానికి లేదా వీలైనంత చిన్న ముక్కలుగా దాన్ని విడగొట్టడానికి మనకొక చరిత్రాత్మక అవకాశం లభించింది” అని అన్నారు.

‘ఇందిరను ఎప్పుడూ దుర్గ అవతారంగా పిలవలేదు’

ఢాకాలో పాకిస్తాన్ సైనికులు లొంగిపోయిన రోజున ఇందిరా గాంధీని వాజ్‌పేయి దుర్గ అవతారంగా పిలిచారని సాధారణంగా ప్రజలు అనుకుంటారు.

అభిషేక్ చౌదరి దీన్ని తోసిపుచ్చారు.

“అసలు నిజం ఏంటంటే, డిసెంబర్ 16న వాజ్‌పేయి పార్లమెంటుకు హాజరు కాలేదు. అప్పుడు ఆయన ఏదో పర్యటనలో లేదా అనారోగ్యంతో ఉన్నారు. కాల్పుల విరమణపై చర్చించేందుకు ఇందిరా గాంధీ ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించినప్పుడు, దానికి ఆయన హాజరు కూడా కాలేదు.

ఆ మరుసటి రోజు కాల్పుల విరమణకు మద్దతు తెలిపినందుకు అన్ని పార్టీలకు ఇందిరా గాంధీ ధన్యవాదాలు తెలుపుతున్నప్పుడు, వాజ్‌పేయి లేచి నిలబడి ‘మాకు కాల్పుల విరమణ వద్దు. మేం శత్రువులందరినీ శాశ్వతంగా నిర్మూలించాలని అనుకుంటున్నాం. అందుకోసం పశ్చిమ సెక్టర్‌లో యుద్ధం కొనసాగాలి’ అని వాజ్‌పేయి అన్నట్లు’’ చౌదరీ చెప్పారు.

నాటి లోక్‌సభ స్పీకర్ గురుదయాళ్ సింగ్ ధిల్లాన్ దీనిపై చర్చకు అనుమతి ఇవ్వకుండా ‘‘ఈ శుభ సందర్భంలో ఆయన ఇలా అనుచితంగా మాట్లాడకూడదు’’ అని వాజ్‌పేయిని ఉద్దేశించి అన్నారు.

రెండు రోజుల తర్వాత ఇందిరా గాంధీని అభినందించేందుకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినప్పుడు వాజ్‌పేయి ఉద్దేశపూర్వకంగానే దానికి హాజరుకాలేదు.

ఇందిర విషయంలో కరుకుదనంగా మారిన స్నేహం

కొన్ని రోజుల తర్వాత వాజ్‌పేయి విజయోత్సవ ర్యాలీలో ప్రసంగించేందుకు బొంబాయి వెళ్లారు.

అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఎన్నో శతాబ్దాలుగా దేశం ఇంతటి విజయాన్ని సాధించలేదు. ఈ విజయానికి అసలు కారణం భారత సైనిక బలగాలు’’ అన్నారు.

రెండు వారాల యుద్ధంలో ఇందిరా గాంధీ సమర్థంగా వ్యవహరించారని, దేశానికి నమ్మకమైన నాయకత్వాన్ని అందించారని కూడా వాజ్‌పేయి ప్రశంసించారు.

కానీ, మూడు నెలల తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి, ఇందిరా గాంధీతో ఆయన స్నేహం దాదాపు ముగిసింది.

జనసంఘ్ 1967-1972 మధ్య కాలంలో దిల్లీకి స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చిందని, ఈ విషయంలో జనసంఘ్ గురించి ఇందిరా గాంధీ ఏనాడూ ఒక్క మంచి మాట కూడా అనలేదన్నది ఆయన ఫిర్యాదు.

రోడ్లు, కాలనీల పేర్లు మార్చడం తప్ప జనసంఘ్ చేసిందేమీ లేదని ఆమె ప్రతి చోటా ఆరోపించారని వాజ్‌పేయికి కోపం.

1972 మార్చి 4 సంచికలో ఆర్గనైజర్ పత్రిక వాజ్‌పేయిని ఉటంకిస్తూ, “పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభించడంలో ఆలస్యం చేసిన ఇందిరా గాంధీ కాల్పుల విరమణను కూడా ముందుగానే ప్రకటించారు. సోవియట్ ఒత్తిడితో వారు కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. అది కూడా ఆర్మీ చీఫ్‌లను సంప్రదించకుండానే. పాకిస్తాన్‌తో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే, పాకిస్తాన్ సైన్యం వెన్ను విరిగిపోయేది” అని రాసింది.

వాజ్‌పేయికి ఇందిరా గాంధీ సమాధానం

1972 జులైలో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందం వాజ్‌పేయికి నచ్చలేదు.

పాక్‌ అధీనంలోని కశ్మీర్‌ను తీసుకోకుండానే పంజాబ్‌, సింధ్‌లలో పాకిస్తాన్‌ నుంచి గెలుచుకున్న భూమిని భారత్‌ తిరిగి ఇచ్చేసిందనేది ఆయన ఫిర్యాదు.

ఆ సమయంలో ఆయన రాజస్థాన్ సరిహద్దులో పాకిస్తాన్ నుంచి గెలుచుకున్న గాద్రా పట్టణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అభిషేక్ చౌదరి ఇలా రాశారు. “ఆయన తనతో 64 మంది సత్యాగ్రహులను తీసుకువెళ్ళారు. వారందరూ ‘దేశ్ న హారా, ఫౌజ్ న హారి, హారి హై సర్కార్ హమారీ (దేశం ఓడిపోలేదు, బలగాలు ఓడలేదు, ఓడిపోయిందల్లా మన సర్కారే)’ అని నినాదాలు చేశారు.”

మండుతున్న ఎండలను, గాలిని తట్టుకుని నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాళ్లు గాద్రా పట్టణంలోకి ప్రవేశించారు.

గెలిచిన ప్రాంతానికి 180 మీటర్ల దూరంలోకి రాగానే వాజ్‌పేయిని, ఆయన సహచరులతో కలిపి అరెస్టు చేసి, ట్రక్కులలో కూర్చోబెట్టి భారత భూభాగానికి తీసుకువచ్చారు.

తిరిగి వచ్చాక, వాజ్‌పేయి బోట్ క్లబ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “చివరి రోజు క్రెమ్లిన్ నుంచి వచ్చిన సందేశం తర్వాత సిమ్లాలో ప్రతిష్టంభన తొలగిపోయిందా” అని ఇందిరను ప్రశ్నించారు.

అప్పటివరకు వాజ్‌పేయి ఆరోపణలను ఇందిర పట్టించుకోలేదు.

కానీ, ఈసారి వాజ్‌పేయి ప్రశ్నకు బదులిస్తూ ఆమె, ‘‘ఆత్మన్యూనత ఉన్న వ్యక్తి మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. మనం కోట్ల మంది ప్రజల గొంతుకను విందామా? లేదా, నిత్యం ఏడుస్తూనే ఉండేవాళ్ల గొంతును విందామా? వాజ్‌పేయి పోయిన సంవత్సరమంతా నన్ను ఎగతాళి చేస్తూ గడిపారు. ఈ రోజు బంగ్లాదేశ్ అనేది ఒక వాస్తవం అనే విషయాన్ని వాజ్‌పేయి ఖండించగలరా’’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రధాన న్యాయమూర్తి నియామకంపై విమర్శలు

రెండేళ్లలోనే ఇందిరపై మాటల దాడి చేసే అవకాశం వాజ్‌పేయికి వచ్చింది.

మారుతీ కార్ల ఫ్యాక్టరీని స్థాపించినప్పుడు సంస్థతో ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ బంధాన్ని దృష్టిలో ఉంచుకొని, “ఈ కంపెనీ మారుతీ లిమిటెడ్ కాదు, అవినీతి అన్‌లిమిటెడ్” అంటూ వాజ్‌పేయి విమర్శలు చేశారు.

ఇందిర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను విస్మరించి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఏఎన్ రాయ్‌ను నియమించినప్పుడు ఆమెను విమర్శించడానికి వాజ్‌పేయికి మరో అవకాశం లభించింది.

వాజ్‌పేయి వ్యంగ్యంగా- ‘‘రేపు ప్రధాన ఎన్నికల కమిషనర్‌, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధిపతుల నియామకం కూడా ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ నిబంధన సాయుధ బలగాలకు కూడా వర్తిస్తుందా? ‘జీ హుజూర్’ అనే వాళ్ల వల్ల ప్రజలకు న్యాయం జరగదు, అందుకు స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం’’ అన్నారు.

1974లో భారతదేశం తన మొదటి అణు పరీక్షను నిర్వహించినప్పుడు, వాజ్‌పేయి భారత అణు శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కానీ, ప్రధానిని మాత్రం ప్రశంసించలేదు.

జగ్జీవన్‌రామ్‌ను ప్రధానిని చేయాలన్నారు

1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయంతో భారతీయ జనసంఘ్‌కు అత్యధికంగా 90 సీట్లు వచ్చాయి. భారతీయ లోక్‌దళ్‌కు 55 సీట్లు, సోషలిస్టు పార్టీకి 51 సీట్లు వచ్చాయి.

అతిపెద్ద పార్టీ అయినందున వాజ్‌పేయి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసి ఉండవచ్చు. కానీ, అది జరగలేదు.

‘‘దీనికి కారణం వాజ్‌పేయి వయసు 52 ఏళ్లు. మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్‌లతో పోల్చితే అప్పటి వరకు ఆయనకు పరిపాలన అనుభవం లేదు’’ అని అభిషేక్ చౌదరి చెప్పారు.

“నాయకత్వ రేసులో వాజ్‌పేయి కూడా పాల్గొని ఉంటే, కొత్తగా ఏర్పడిన జనతా పార్టీకి మరిన్ని సమస్యలు తలెత్తేవి. ఒక వ్యూహం ప్రకారం వాజ్‌పేయి వెనక్కి తగ్గాలని, తన వంతు కోసం వేచి ఉండాలని కోరారు.”

వాజ్‌పేయి మొదట్లో ప్రధానమంత్రి పదవికి జగ్జీవన్ రామ్‌కు మద్దతును తెలిపారు. పార్లమెంట్‌లో ప్రత్యర్థి అయినా ఆయన జగ్జీవన్‌రామ్‌తో బాగానే ఉండేవారు.

మొరార్జీ దేశాయ్ మొండివారు, మృదుత్వం లేనివారు. జగ్జీవన్‌రామ్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా దళితుల్లో సంఘ్‌ పరివార్‌ ఇమేజ్‌ మెరుగుపడుతుందని అనుకున్నారు. కానీ, చరణ్ సింగ్ మొత్తం ప్రయత్నాల మీద నీళ్లు చల్లారు

ఆయన ఆసుపత్రి బెడ్ మీద నుంచి రాసిన లేఖలో.. పార్లమెంట్‌లో ఎమర్జెన్సీని ప్రతిపాదించారనే కారణంతో జగ్జీవన్ రామ్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు.

దీంతో, మొరార్జీ దేశాయ్‌కు మద్దతు ఇవ్వడం తప్ప వాజ్‌పేయికి మార్గం లేకపోయింది.

జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి పదవి

చరణ్ సింగ్ ఉన్నప్పుడు జనతా ప్రభుత్వంలో వాజ్‌పేయికి హోం శాఖ వచ్చే అవకాశమే లేదు.

మొరార్జీ దేశాయ్ రక్షణ లేదా విదేశాంగ శాఖలలో ఒక విభాగాన్ని ఎంచుకోవాలని కోరారు.

వాజ్‌పేయికి విదేశీ వ్యవహారాల శాఖను ఎంచుకోవడానికి ఒక్క సెకను కూడా పట్టలేదు.

ఎన్నికల అనంతరం రాంలీలా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో వాజ్‌పేయి ఇందిరను లక్ష్యంగా చేసుకుని, ‘‘భారతదేశానికి పర్యాయపదాలుగా చెప్పుకునే వ్యక్తులను ప్రజలు చరిత్ర చెత్తబుట్టలో పడేశారు’’ అన్నారు.

వాజ్‌పేయి మాటలు తప్పని నిరూపించిన ఇందిర మూడేళ్ల తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చారన్నది వేరే విషయం.

ప్రధానిగా వాజ్‌పేయికీ అవకాశం దక్కింది. ఆయన 1996లో, మళ్లీ 1998, 1999లలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పదవీకాలం పూర్తి చేసుకున్న మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఆయనదే.