మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తో ఎన్సీపీ చీలికవర్గం నేత అజిత్ పవార్ వరుసగా రెండోరోజు సోమవారం కూడా సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి సమావేశం బెంగళూరులో ప్రారంభమైన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తో ఎన్సీపీ చీలికవర్గం నేత అజిత్ పవార్ వరుసగా రెండోరోజు సోమవారం కూడా సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి సమావేశం బెంగళూరులో ప్రారంభమైన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
ఆశీర్వాదం తీసుకుందామని..
శరద్ పవార్ ఎన్సీపీ నాయకులందరికీ ఆరాధ్యడైన నాయకుడని, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఆయనను కలిశామని ఎన్సీపీ చీలికవర్గం నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఎన్సీపీ ని చీల్చి శివసేన షిండే వర్గం, బీజేపీల ప్రభుత్వంలో చేరడంలో తనకు సహకరించిన ఎన్సీపీ నాయకులతో కలిసి ఎన్సీపీ చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న అజిత్ పవార్ ఆదివారం పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తో ముంబైలోని వైబీ చవాన్ సెంటర్ లో సమావేశమయ్యారు. తిరిగి, సోమవారం కూడా ఆయన తన వర్గంతో కలిసి శరద్ పవార్ ను కలిశారు.
పార్టీని ఐక్యంగా ఉంచాలని..
ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ తమకు గౌరవనీయుడైన నాయకుడని, ఎన్సీపీ ఐక్యంగా ఉండేలా ఆయన కృషి చేయాలని కోరామని శరద్ పవార్ ను కలిసిన ఎన్సీపీ చీలికవర్గం నేతలు తెలిపారు. పార్టీని ఐక్యంగా ఉంచాలని ఆయనను కోరామని ప్రఫుల్ పటేల్ తెలిపారు. ‘‘మేం చెప్పిందంతా ఆయన ఓపికగా, మౌనంగా విన్నారు. ఏమీ మాట్లాడలేదు. మా అభ్యర్థనలకు ఆయన ఏ విధంగానూ స్పందించలేదు. ఆయన మనస్సులో ఏముందో తెలియడంలేదు’’ అని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ ను కలిసిన వారిలో అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లతో పాటు ఎన్సీపీ నేతలు హసన్ ముష్రిఫ్, ఛగన్ బుజ్భల్, ఆదితి తత్కరే, దిలీప్ వాల్సే పాటిల్.. తదితరులున్నారు.
విపక్ష కూటమి సమావేశం సమయంలోనే..
అదే సమయంలో, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన విపక్షాలు సోమ, మంగళవారాలు బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశమవుతున్నాయి. ఆ కూటమిలో కీలక నేత శరద్ పవార్. ఆ సమావేశానికి సోమవారం శరద్ పవార్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. అయితే, విపక్ష కూటమి ముఖ్యమైన భేటీ మంగళవారం జరుగుతుందని, మంగళవారం జరిగే విపక్ష కూటమి భేటీకి శరద్ పవార్ హాజరవుతారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడించారు.