కోవాగ్జిన్ ఒప్పందంపై బ్రెజిల్ సెనేట్ దర్యాప్తు!
భారీ కుంభకోణమనే ఆరోపణలు
ఒప్పందంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ప్రత్యేక ఆసక్తి
భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ సరఫరా కోసం కుదిరిన ఒప్పందం బ్రెజిల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంట్లో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సీపీఐ) ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆరోపణ. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ (అన్విసా)ల అనుమతి పొందని కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎందుకు ఒప్పందం చేసుకుందని, ఏ ప్రయోజనాలు ఆశించిందని ఆరోగ్యరంగ నిపుణులు, సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు.
వ్యాక్సిన్లను నమ్మరు.. కోవాగ్జిన్‌పై అమితాసక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాగే బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కోవిడ్–19ను తేలికగా తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మాస్కును ధరించకపోవడం… సామాజిక దూరా న్ని పాటించపోవడంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణలో సరిగా వ్యవహరించకపోవడం వల్లే బ్రెజిల్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆగ్రహావేశాలు దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్నాయి. మూడు నాలుగు రోజుల కిందటే బ్రెజిల్‌లో కోవిడ్ మరణాలు ఐదు లక్షల మార్కును దాటేశాయి. వ్యాక్సిన్లను పెద్దగా విశ్వసించని బొల్సొనారో కోవాగ్జిన్‌తో ఒప్పందానికి మాత్రం అమితాసక్తి చూపించారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ‘వెంటనే జనవరి 8వ తేదీన భారత ప్రధాని మోదీతో బొల్సొనారో ఫోన్లో మాట్లాడారు. తమకు కోవాగ్జిన్ కావాలని అభ్యర్థించారు. కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రెపిసా మెడికామెంటోస్ ప్రతినిధులు జనవరి 6, 8వ తేదీల్లో ఢిల్లీలోనే ఉన్నట్లు తేలింది. బొల్సొనారోకు ప్రవర్తన కోవాగ్జిన్ కొనుగోలు ఒప్పందంలో తెరవెనుక ఏదో జరిగిం దనే అనుమానాలకు తావిస్తోంది’ అని సెనేట్ కమిషన్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సెనేటర్ రాండోల్ఫ్ రోడ్రిగ్స్ శనివారం వ్యాఖ్యానించారు.
ఒత్తిడి తెచ్చారు
కోవాగ్జిన్ దిగుమతికి పూచీ ఇవ్వాల్సిందిగా తనపై అసాధారణ ఒత్తిడి వచ్చిందని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. మాజీ ఆరోగ్యమంత్రి ఎడ్వర్డో పాజుయెలోకు సన్నిహితుడైన లెఫ్టినెంట్ కల్నల్ అలెక్స్ లియాల్ మారిన్హో ఈ మేరకు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశారని సదరు ఉన్నతాధికారి వెల్లడించారు. కోవాగ్జిన్ కొనుగోలులో ప్రెసిసా మెడికామెంటోస్ పాత్రపై సెనేట్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. కుంభకోణాల నిగ్గుతేలుస్తాం. ఏరకంగా చూసినా ఇది అసాధారణ సేకరణ ఒప్పందమే’ అని ప్యానెల్ ప్రతినిధి, సెనేటర్ రెనాన్ కాల్హీరోస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రెసిసా మెడికామెంటోస్ మేనేజింగ్ పార్ట్‌నర్ ఫ్రాన్సిస్కో మాక్సిమియానోను బుధవా రం పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. మాక్సిమియానో టెలికమ్యూనికేషన్ డేటా మొత్తం సమీకరించి ప్యానెల్‌కు అందుబాటులో ఉంచారు. సెనెటర్ల నుంచి ఆయన లోతైన ప్రశ్నలను ఎదుర్కొనబోతున్నారు. మాక్సిమియానో విచారణ మొత్తం టీవీల్లో ప్రత్యక్షప్రసారం కానుంది. గతకొద్ది రోజులుగా కోవాగ్జిన్ ఒప్పందంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు సంబంధించిన అంశాలు బ్రెజిల్ టీవీ ఛానళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి.
ఏం జరిగింది?
భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కోవాగ్జిన్ 2 కోట్ల డోసులను (టెక్నాలజీని బదిలీ చేసే అంశం కూడా ఉంది) సరఫరా చేయడానికి 300 మిలియన్ డాలర్లు (రూ.2.230 కోట్లు) చెల్లించేలా బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్ మధ్యవర్తిగా వ్యవహరించింది. దీనికిగాను ప్రెసిసా మెడికామెంటోస్‌కు ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముట్టాయనే పత్రాలు పార్లమెంటరీ ప్యానెల్ దగ్గర ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో సన్నిహిత గ్రూపులకు ఇందులో వాటా దక్కిందనే అనుమానాలున్నాయి. వీటిపైనే పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తు జరుపుతోంది. 2 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు 2,230 కోట్లతో ఒప్పందం చేసుకోగా… ఇందులో మూడోవంతు అంటే 734 కోట్ల రూపాయలు మధ్యవర్తి సంస్థకు దక్కడం పలు సందేహాలకు తావిస్తోంది. అయితే బ్రెజిల్ ఆరోగ్యశాఖ మాత్రం తామింకా ఎలాంటి చెల్లింపులు చేయలేదని చెబుతోంది. 2020 నవంబరులో బ్రెజిల్‌తో భారత్ బయోటెక్‌కు ఒప్పందం కుదిరింది. భారత సాంకేతిక ప్రగతిని ఇదొక నిదర్శనంగా పేర్కొన్నారు. కానీ ఎనిమిది నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా బ్రెజిల్‌లో ఒక్కరికీ కోవాగ్జిన్ ఇవ్వలేదు. ఎందుకంటే మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను సమర్పించలేదని, సరైన ఉ్పత్పత్తి ప్రమాణాలు లేవని అన్విసా మార్చి 31న కోవాగ్జిన్ వాడకానికి అనుమతి నిరాకరించింది. చివరకు ఈనెల 4వ తేదీన పలు కఠిన షరతులతో 40 లక్షల డోసుల కోవాగ్జిన్ దిగుమతికి అనుమతించింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతి రాకముందే… పచ్చజెండా ఊపడం వెనుక బొల్సొనారో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు.