మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబును జత చేస్తూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జీవన్‌రెడ్డి.. కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘నీ పోచారం శ్రీనివాసరెడ్డి చంద్రబాబు పంచన లేడా? నీ దయాకర్ రావు చంద్రబాబు పంచన లేడా? నీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు పంచన లేడా?గంగుల కమలాకర్ ది ముందు టీడీపీ కాదా? బాబూ కేసీఆర్ అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? రేవంత్ రెడ్డి గురించి తెలుసుకుని మాట్లాడండి.
చంద్రబాబు దయా దక్షిణ్యాలతోనే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష. నీ మంత్రి వర్గం మొత్తం టీడీపీలోనే పుట్టింది. రాహుల్‌కు నీలాగా వాస్తవాలను వక్రీకరించడం రాదు. నువ్వా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది..? మేము ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు నీ బతుకు దెరువు ఏంది కేటీఆర్? కాంగ్రెస్ ఆందోళనతోనే మూడు రోజులుగా 24 గంటలు ఇస్తున్నారు. ఆ సోయి మొన్నటిదాకా ఎందుకు లేదు కేటీఆర్?’’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.