బెజవాడలో మూడు అసెంబ్లీ స్థానానాలు ఉన్నాయి. తాజాగా పవన్ చేసిన కామెంట్స్‌తో మూడు సీట్లను మూడు పార్టీలు పంచుకోవాలని ఫిక్స్ అయినట్లుగా భావిస్తున్నారు. ఇందు కోసం అవసరమైతే సెంట్రల్ నియోజకవర్గ సీటుకు బదులుగా తూర్పు నియోజకవర్గ సీట్‌ను తెలుగు దేశం సర్దుబాటు చేసుకునేందుకు రెడీ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం జనసేన కర్చీఫ్ వేసిందని టాక్. సెంట్రల్ నియోజకవర్గ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు పార్టీలు కలుస్తాయనే అభిప్రాయాన్ని తాజాగా పవన్ ఢిల్లీ వేదికగా వ్యక్తం చేశారు. అలా కలిస్తే మాత్రం మూడు పార్టీలు సీట్ల సర్దుబాటుపై అభిప్రాయానికి వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో జరిగిన పరిణామాలను నేతలు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. చిరంజీవి పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు సీట్లలో రెండు ప్రజారాజ్యం కైవసం చేసుకుంది.
ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాల్లో అదే క్రేజ్ ఉందని అంటున్నారు. సో పొత్తులు ఓకే అయితే విజయవాడ పశ్చిమ సీటు జనసేన అభ్యర్థికి ఇస్తారని అంటున్నారు.విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన నేత విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సీటును తెలుగు దేశం కైవసం చేసుకుంది. ఇదే నియోజకవర్గంలో జనసేనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పొత్తులపై క్లారిటి వస్తే ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి అప్పగిస్తారని అంటున్నారు. అక్కడ జనసేన అధినేత కూడా ప్రచారం చేసేందుకు అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇప్పటికే తెలుగు దేశం బలంగా ఉండటం, ఆ పైన జనసేన ప్రభావం కూడా పడితే అక్కడ తిరుగు ఉండదని చెబుతున్నారు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం మరింత కీలకంగా ఉంది. గతంలో నియోజకవర్గా పునర్విభజన జరగక ముందు ఈ నియోజకవర్గంలో అధిక భాగం విజయవాడ తూర్పులో ఉంది. అక్కడ నుంచి సినీ నటుడు కోట శ్రీనివాసరావు, తెలుగు దేశం సపోర్ట్‌తో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ తరపున విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు దేశానికి మంచి మెజార్టీ ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు, తెలుగు దేశం పార్టీ అభ్యర్ది బోండా ఉమాపై కేవలం 32 ఓట్ల తేడాతో విజయం సాధించారంటే, టీడీపీకి ఉన్న ఓటింగ్ అర్థమవుతుంది. సో పొత్తుల వ్యవహరం తేలితే సెంట్రల్‌లో భారతీయ జనతా పార్టి ఎన్నారైను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇలా బెజవాడలోని మూడు నియోజకవర్గాలను మూడు పార్టీలు పంచుకోవటం ద్వార గందరగోళానికి తావులేకుండా ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి