రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దేశంలో ఉండి పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం అవుతోంది. అందరి ఆమోదయోగ్యంతో టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. నిర్మాణాలను సైతం ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారింది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా వివాదాలు, కోర్టు కేసులతో విశాఖ రాజధాని అంశం సతమతమవుతోంది. చివరకు విశాఖ పాలన రాజధాని నిర్ణయాన్ని కోర్టులో వైసిపి ప్రభుత్వం ఉపసంహరించు కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు అమరావతి రాజధానిని కొనసాగించలేదు. విశాఖను పాలనా రాజధానిగా చేయనూ లేదు. దీంతో రాజధాని లేని రాష్ట్రం గా ఏపీ నవ్వుల పాలయ్యింది అయితే విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. పదేళ్లపాటు అగ్రిమెంట్ సైతం ఉంది.
ఈ పదేళ్లలో రాజధానిని అభివృద్ధి చేసుకోవాలన్నది విభజన చట్టంలో పొందుపరిచిన అంశం. కానీ గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధాని అభివృద్ధి నిలిచిపోయింది. విశాఖ రాజధాని కి అడుగులు పడలేదు. విభజన చట్టం ప్రకారం జూన్ 2 తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. అటు తరువాత హైదరాబాద్ పై ఏపీకి ఎటువంటి హక్కు ఉండదు. అయితే ఈ సంక్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఒకవేళ అమరావతి రాజధానిని కేంద్రం గెజిట్ లో పేర్కొంటే మాత్రం.. అమరావతి శాశ్వత రాజధాని. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధానిగా మార్చాల్సి ఉంటే.. పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. అందుకే ఇప్పుడు కేంద్రం నిర్ణయం కీలకం. కానీ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. ఒక రెండు నెలలు ఆగి.. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఏపీ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో పార్టీల గెలుపోటములపైనే రాజధాని నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.