kanugolu
తెలంగాణ రాజకీయం

కనుగోలు కోసం ఎదురు చూపులు

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సేవలు అక్కరకు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఇంకా ఆయన సీన్‌లోకి రాకపోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పటికే క్లారిటీ వచ్చేసి ఉంటుంది.. ఆయనే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త సునీల్ కనుగోలు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన సేవలు అక్కరకు వస్తాయని తెలంగాణ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు.

సునీల్ కనుగోలు మొదట్లో పూర్తిస్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ చేశారు. ఆయన వచ్చి రావడంతోనే తెలంగాణ కాంగ్రెస్ లోని నేతల పని తీరుతో పాటు నియోజకవర్గాలు పార్టీ బలబలాల పైన ఇలా అనేక సర్వేలతో నివేదికలను సైతం రూపొందించి పార్టీ హైకమాండ్‌కు అందించారు. అంతేకాదు ఏయే నియోజకవర్గాల్లో ఏ నేతలని పార్టీలో చేర్చుకోవాలి? ఎవరికి టికెట్లు ఇవ్వాలి? అనేదానిపై అనేక సర్వేల సైతం నిర్వహించి టిపిసిసితో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం నివేదికలు సమర్పించారు. ఆ వ్యూహకర్త సర్వేలతో కాంగ్రెస్ నేతలు హడలెత్తిపోయారంటే ఆయన సర్వేలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అయితే కర్ణాటకలో సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన తెలంగాణ కాంగ్రెస్ పై పోకస్ తగ్గించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదట. దీంతో ఆ వ్యూహకర్త ఇప్పుడు ఎక్కుడున్నారు? ఏం చేస్తున్నారంటూ? రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది..మరి కొన్ని నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతుండడంతో అన్ని పార్టీలుతో పాటు కొందరు నేతలు నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త కనుగోలు తెలంగాణపై ఫోకస్ చెయ్యకపోవడంతోనే కాంగ్రెస్ సర్వేలు జరగడం లేదనే అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో భారీ విజయం తర్వాత కనుగోలును సిద్ధరామయ్య ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది.

ఇప్పుడు ఆయన కర్ణాటక సలహాదారు పనులతో బిజీ అయిపోయారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తిస్‌ఘడ్  ఎన్నికలు ఉండడంతో అక్కడ సునీల్ టీం పని చేస్తుండడంతో తెలంగాణలో సరిగ్గా దృష్టి పెట్టడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.కర్ణాటక ఫలితం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య హోరాహోరీ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎన్నికల ముంగిట పొలిటికల్ మైలేజ్ కోసం అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకునేందుకు ఆ పార్టీలు సిద్ధంగా లేవు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే డిక్లరేషన్ లని ప్రకటిస్తూ.. మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ పథకాలను అందిస్తామన్న అంశాలను ఇప్పటికే టీపీసీసీ నేతలు ప్రకటిస్తున్నారు.

ఇలాంటి సమయంలో సునీల్ కనుగోలు టీం వర్క్ ఎంతో కీలకమని నేతలు భావిస్తున్నారు. వచ్చిన మొదట్లో సర్వేలతో బిజీగా గడిపిన కనుగోలు టీం.. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో ఎలాంటి సర్వేలు చేయడం లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సునీల్ కనుగోలుతో పాటు ఆయన టీమ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కూడా  టచ్‌లో ఉండటం లేదనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్ట్ లు , ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కనుకోలు టీం యాక్టివ్‌గా ఉందని.. గ్రౌండ్ వర్క్ చేస్తోందని మరికొందరు నేతలు చెబుతున్నారు.జాతీయ స్థాయిల్లో అన్ని రాష్ట్రాల్లో సునీల్ వ్యూహలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుండడంతో సునీల్ ఇతర రాష్ట్రాల్లోనూ తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీకి తెలంగాణతో పాటు త్వరలో జరిగే మిగిలిన రాష్ట్రాల్లోనూ విజయం సాధించడం కీలకం కావడంతో అక్కడ పనులను ఆయనే చేసుకుంటున్నారని.. అందుకే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా సునీల్ కనుగోలు సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చని కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  మరి తెలంగాణ కాంగ్రెస్ పై పూర్తిస్థాయిలో కనుగోలు ఎప్పుడు ఫోకస్ చేస్తారో వేచిచూడాల్సిందే..