tsrtc
తెలంగాణ ముఖ్యాంశాలు

టెంపుల్ రన్ పై టీఎస్ఆర్టీసీ దృష్టి

ఆధ్యాత్మిక యాత్రలకు ప్రయాణికుల నుంచి వస్తున్న అనూహ్య స్పందన కారణంగా టీఎస్ఆర్టీసీ ఆ దిశగా మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవలే అరుణాచలానికి నడిపిన ప్రత్యేక బస్సులకు విపరీతమైన గిరాకీ వచ్చింది. తాజాగా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ప్రతి వారాంతంలో జేబీఎస్‌ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ టూర్ రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతుంది.

ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి, సాక్షి గణపతి ద‌ర్శనంతో పాటు పాతాళ‌గంగ, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను ప్రయాణికులు చూసేలా ఏర్పాట్లు చేశారు. ఈ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఛార్జీల్లో భాగంగా రవాణా, బస, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ ఛార్జి ప్యాకేజీలో ఉంటుంది. ఆహారం, అల్పాహారం, ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు లాంటి ఇతర ఖర్చులను ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది.

తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు ఉంటుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌.. మీదుగా మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుంది. ముందుగా బస కోసం డైరెక్ట్ గా హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు ఉంటాయి. తర్వాత 3 గంటలకు పాతాళ గంగకు తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రికి ఆ హోటల్లోనే బస ఉంటుంది.రెండో రోజైన ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోడానికి వీలు కల్పించారు. తర్వాత అల్పాహారం ఉంటుంది. హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం లాంటి స్థానిక ప్రాంతాలు చూడవచ్చు.అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం లాంటివి చూసే ఏర్పాట్లు ఉంటాయి. తిరుగు ప్రయాణం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం బస్సు ఆపుతారు.

తర్వాత రాత్రి 7.30 గంటలకు బస్సు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు చేరుతుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత టిక్కెట్ల కోసం డిజిటల్ చెల్లింపులు చేసేలా  ఏర్పాట్లు చేయబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కండక్టర్ కు డబ్బులు చెల్లించకుండా బస్సులోని ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా చెల్లించి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం కసరత్తులు పూర్తి చేసింది. నగదు రహిత టికెట్ కొనుగోలు పద్ధతిని ప్రవేశ పెట్టాలని గతేడాది చివర్లోనే ఆర్టీసీ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.