pattiseema
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

పట్టిసీమ నుంచి డెల్టాకు నీళ్లు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టిసీమ ద్వారా మళీ కృష్ణా డెల్టా కు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి అంబటి కీలక ప్రకటన చేశారు.పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టా కు నీళ్ళు ఇవ్వాలనీ నిర్ణయించామన్నారు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టి సీమ ద్వారా నీళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా కూడా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.కృష్ణా నది ఎగువ నుంచి నీటి ప్రవాహం లేకపోవడంతో పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని లిఫ్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు కురవడం., ఎగువ నుంచి నీరు విడుదల కావడంతో గోదావరి నీటి అవసరం కృష్ణా డెల్టాకు రాలేదన్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో… పట్టిసీమ ద్వారానే మళ్లీ కృష్ణా డెల్టాలకు ఇవ్వాల్సి వస్తోందన్నారు.ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోందన్నారు మంత్రి అంబటి. ఇది 8 లక్షల క్యూసెక్కుల కు పెరిగే అవకాశం ఉందన్నారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిందని… అయితే కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది నిర్ణయిస్తామన్నారు. ఈ విషయంపై కేంద్ర జల సంఘానికి నివేదిక ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.ఎగువ రాష్ట్రాల్లో భారీవర్షాలు వల్ల స్వల్పంగా ఏపీలోని గోదావరి తీర ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది.

ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తోంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది.