3 parties
తెలంగాణ రాజకీయం

మూడు పార్టీలు....అందరి లక్ష్యం...వారే

మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తాము గత తొమ్మిదిన్నరేళ్ళలో చేపట్టిన పథకాలను, చేసిన అభివృద్ధిని చూపుతూ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. విపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు యధాశక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతల పాదయాత్రలు కొనసాగాయి. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష మీద ఫోకస్ చేశారు.

కర్నాటక ఎన్నికల ఫలితాల కారణంగా తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతల చేరడం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరు నెలల ఊగిసలాట తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పలు జిల్లాల్లో చిన్నా, చితకా నేతలు కూడా ఇపుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. చేరికల విషయంలో ప్రత్యేకంగా ఓ మాజీ మంత్రి స్థాయి నాయకుడిని ఇంఛార్జీగా నియమించుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఓ మోస్తరు చేరికలను కూడా సాధించలేకపోయిందనే చెప్పాలి.

గతంలో వున్న ఊపును చూసి బీజేపీలో చేరిన వారిలో ఎక్కువ మందిపుడు ఆ పార్టీని వీడే ఆలోచనలు చేస్తున్నట్లు కథనాలు జోరందుకున్నాయి. కొత్త చేరికల మాటేమిటో కానీ ఉన్న వారిని కాపాడుకోవడం ఇపుడు ఈటల రాజేందర్ భుజస్కంధాలపై పెను భారంగా మారుతోంది. మరోవైపు చాన్నాళ్ళుగా సస్పెన్షన్ ఎత్తివేత గురించి ఎదురు చూస్తున్న హార్డ్ కోర్ హిందుత్వవాది ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా విసుగు చెందినట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవల ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావును కల్వడంతో రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న కథనాలు మొదలయ్యాయి. వెంటనే స్పందించిన ఈటల రాజేందర్.. రాజాసింగ్ ఇంటికి మరీ బుజ్జగించారు.

ఈ సందర్భంగా రాజాసింగ్‌ను గోషామహల్ నియోజకవర్గాన్ని వదిలేసి.. జహీరాబాద్ ఎంపీగా బరిలోకి దిగాలన్న ప్రతిపాదనకు అంగీకరిస్తే సస్పెన్షన్ ఎత్తివేతకు తాను చొరవ తీసుకుంటానని రాజేందర్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈటల ప్రతిపాదనపై రాజాసింగ్ ఎలా స్పందించారన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి బీజేపీలోకి చేరే కొత్త నాయకులు కనిపించడం అటుంచి.. ఉన్న నాయకులను కాపాడుకోవడం ఇపుడు కమలనాథులకు గగనమైపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో పార్టీలో ఊపు తెచ్చేందుకు, శ్రేణులను పోరాటానికి సమాయత్తం చేసేందుకు టీ.బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యూహరచన చేసినట్లున్నారు. అందుకే అటు పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజైనా పట్టించుకోకుండా హైదరాబాద్ సిటీలోనే వుండి కేసీఆర్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళపై ప్రభుత్వాధినేతలు చెబుతున్నదానికి వాస్తవ పరిస్థితికి పొంతన లేదని నిరూపించేందుకు చలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డితోపాటు బాట సింగారానికి బయలు దేరిన బీజేపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి.. తానేమైనా నేరస్థున్నా? లేక టెర్రరిస్టునా అంటూ పోలీసులపై హూంకరించారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు బాట సింగారం బయలుదేరినా వారిని కూడా పోలీసులు నిలువరించారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్ధుగా మారిన బీజేపీ శ్రేణుల్లో మొన్నటి వరంగల్ మోదీ సభ ఇచ్చిన కిక్కు కంటే జులై 20న హైదరాబాద్ వేదికగా కిషన్ రెడ్డి చేసిన పోరాటం ఎక్కువ ఉత్సాహాన్నిచ్చిందని పార్టీ శ్రేణులు చెప్పుకోవడం విశేషం. ఇదే టెంపోని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ముమ్మరం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు.ఇక అటు కాంగ్రెస్ నేతల్లోను కదనోత్సాహం రోజురోజుకూ ఇనుమడిస్తోంది. జులై 19న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంట్లో సమావేశమైన టీ.కాంగ్రెస్ నేతలు ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహాన్ని దాదాపు ఖరారు చేశారు. విడతల వారీగా, రాష్ట్ర స్థాయి కీలక నేతలు బస్సు యాత్రలు నిర్వహించాలని తీర్మానించారు.

ఈలోగా పార్టీలో చేరేందుకు సిద్దమైన వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించారు. జులై 20 పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఎంపీలు కూడా అయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్ళారు. నెలాఖరులో ప్రియాంక పర్యటనను ఖరారు చేయడం ఇపుడు ఈ కాంగ్రెస్ బృందం ముందున్న తక్షణ కర్తవ్యమని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రియాంక సభ ఖరారైతే పార్టీలో చేరే వారి జాబితాకు తుది రూపు నివ్వాలన్నది టీపీసీసీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదంతా ఇలా కొనసాగుతుండగా ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఓబీసీ నేతలు ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తూ వుండడం ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంట్లో కీలక నేతలంతా భేటీ అయిన సందర్భంలోనే అటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓబీసీ నేతలు వి.హనుమంతరావు సారథ్యంలో భేటీ అయ్యారు.

పార్టీలో ఓబీసీలకు ప్రాధాన్యత మరించ పెంచాలని డిమాండ్ చేశారు.  సంగారెడ్డిలో జరిగిన ఓబీసీ నాయకుల భేటీలో విహెచ్‌తోపాటు, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ పాల్గొన్నారు. త్వరలోనే బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామని విహెచ్ వెల్లడించారు. బీసీ గర్జనకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒప్పుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విహెచ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా వున్నాయి. ‘‘ అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుంది.

అగ్రకులాల వాళ్ళు ఓబీసీలను అణగదొక్కుతున్నారు.. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారు.. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారు.. ఫస్ట్ 20 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం.. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఓబీసీలకు ఇవ్వాలని అడుగుతున్నాం ..నేనెవ్వరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్‌గా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాటే వింటాను.. ’’ అంటూ పార్టీలో ఓబీసీల వాదన తాను గట్టిగా వినిపిస్తానన్న సంకేతాల్నిస్తున్నారు విహెచ్. అయితే, అటు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా బీసీ రాగమందుకోవడం విశేషం. కాంగ్రెస్ పాలనలోనే బీసీలకు ప్రయోజనం వుందంటూ … బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.ఇక సడన్‌గా అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఓబీసీ నేతలూ భేటీ అవడం కూడా ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తోంది. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తదితరులు జులై 19న హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

కేసీఆర్ ప్రభుత్వం ఓబీసీ వర్గాలకు ఏ మేరకు సంక్షేమ ఫలాలను అందించిందో వివరించే ప్రయత్నం చేశారు. జులై 25న మరోసారి భేటీ కావాలని, దానిని మరింత విస్తృతంగా నిర్వహించాలని తలపెట్టారు. తదుపరి భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, 93 బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా భారీస్థాయిలో ఓబీసీల బహిరంగ సభకు ప్లాన్ చేయాలని బీఆర్ఎస్ మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ఓబీసీల ఆత్మ గౌరవ సభ అని నామకరణం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనకు ప్లాన్ చేస్తుంటే.. దానికి పోటీగా బీఆర్ఎస్ ఓబీసీల ఆత్మ గౌరవ సభకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో దాదాపు 56 శాతం ఓబీసీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి ఓట్లే విజయాలను పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తాయన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ బీసీల ఓట్లకు గాలమేసే వ్యూహాలను రచిస్తున్నాయి.