veeresham
తెలంగాణ రాజకీయం

నల్గోండలో చేరికలకు ఫుల్ స్టాప్..?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇతర పార్టీల నేతల చేరికలపై సందిగ్ధత కొనసాగుతుందా? ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారా? కోమటిరెడ్డి వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరికకు బ్రేక్ పడినట్లేనా? పార్టీలో కొత్త చేరికలు చిచ్చు పెడుతున్నాయా? ఇతర పార్టీల నేతల చేరికను దిగ్గజ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది. ప్రత్యేక కథనం మీకోసం.ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్ నల్గొండ కాంగ్రెస్. కర్ణాటక ఎన్నికల ఫలితాల జోష్‌తో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. రాష్ట్ర కాంగ్రెస్ లో దిగ్గజ నాయకులంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే.

దిగ్గజ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి చేతుల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలకు గట్టిపట్టు ఉంది. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఉన్నారని, కొత్తగా చేరే వారితో లాభం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ బీఆరెస్ నేత కన్మంత రెడ్డి శశిధర్‌రెడ్డిలు పార్టీలో అసంతృప్తితో ఉన్నారు.

నకిరేకల్ నుంచి 2014లో వేముల వీరేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటినుంచి ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. తనకు టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానంతో వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు వేముల వీరేశంతో చేరికపై అంతర్గతంగా చర్చించారట. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పట్టు ఉంది. వేముల వీరేశం చేరికను ఎంపీ కోమటిరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.