బెంగళూరులో ఇండియా కూటమి, ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశాలు దేశరాజకీయాల్లో ఎన్నికల వేడిని మరింత పెంచాయి. ఈ రెండు సమావేశాలు నేపథ్యంలో ఏపీలో కూడా రాజకీయ చర్చలు తీవ్రంగానే సాగాయి. పాత్రమిత్రులను బీజేపీ కలుపుకుంటుందని, అందులో భాగంగా టీడీపీకి కూడా ఆహ్వానం ఉంటుందని జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ఈలోగా కేంద్రమంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలాన్నిచ్చాయి. కాని, ఈ కామెంట్లను చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు.
ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుని, వెంపర్లాడే ధోరణలో తాము లేముఅన్నట్టుగా చంద్రబాబు కామెంట్స్ చేశాఉ. ఎన్డీయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం లేదనే అంశాన్ని పరోక్షంగా చంద్రబాబు ఖరారు చేశారు. ఇదే సమయంలో పవన్‌కళ్యాణ్‌కు అధికారికంగా ఆహ్వానం అందడం, ఆయన హాజరుకావడం సహజంగానే ఆసక్తిని రేకెత్తించింది.ఢిల్లీ చేరుకోగానే పవన్‌కళ్యాణ్ పలు జాతీయ మీడియాతో మాట్లాడారు. అక్కడకూడా ఆయన సీఎం జగన్‌పైనే తాన బాణాలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు, అవినీతి, డేటా చౌర్యం గురించి ఆరోపణలు చేస్తూ, బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీకి దిగాలన్న ఆశాభావాన్ని వ్యక్తంచేయడంతో ఎన్డీయే తరఫు సమావేశానికి దళారీగా వెళ్లారంటూ వైసీపీ విమర్శలు చేసింది.
ఎన్డీయే వేదికగా పవన్‌కళ్యాణ్ ఏం మాట్లాడారన్న ఆసక్తి కంటే ఆ తర్వాత అమిత్‌షాతో, జేపీ నడ్డాలతో ఏం మాట్లాడారు? అన్నదానిపైనే రాష్ట్రంలో చర్చ నడిచింది. ఢిల్లీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం రెండు పార్టీలు కలిసే పోటీకి వెళ్లాలన్న విషయాన్ని బీజేపీ అధిష్టానం మరోసారి చెప్పినప్పటికీ, టీడీపీని కూడా కలుపుకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని పవన్‌వ్యక్తంచేసినట్టుగా వారు చెప్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా పవన్‌కళ్యాణ్‌గాని, జనసేనగాని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిణామాలు చూసిన ఒక సీనియర్ జర్నలిస్టు.. ఆసక్తికర కామెంట్ చేశారు.
చంద్రబాబుకు రాజకీయంగా పవన్ ఒక తప్పనిసరి అవసరంగా మారారని ఆయన అన్నారు.మరోవైపు టీడీపీ శిబిరం కూడా వ్యవహారంపై మౌనంగానే ఉంది. డేటా చౌర్యం ఆరోపణలను ఆపార్టీ పెద్దగా భుజానికి ఎత్తుకున్నట్టు కనిపించడం లేదు. ఇటు బెంగళూరులో ఇండియా సమావేశంపైన కాని, అటు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం గురించి కాని ఎలాంటి రెస్పాన్సూ ఆపార్టీ నుంచి లేదు. టీడీపీ రాజకీయ గమనంలో ఇంత తటస్థత ఎప్పుడూ లేదనే చెప్పాలి. తాను రాష్ట్రానికే పరిమితం, కేంద్రస్థాయిలో అంశాలవారీగానే ఆలోచిస్తాం అని తొలినాటినుంచీ వైయస్. జగన్ స్పష్టంచేస్తుండడంతో తాను నిర్ణయించుకున్న దారిలోనే ఆయన నడుస్తున్నారని చెప్పొచ్చు. చిరకు ఏపీలో పొత్తుల విషయం టి-20 క్రికెట్‌లో సూపర్ ఓవర్ ఉత్కంఠ దశకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.