వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నెల్లూరు జిల్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా కంచుకోటలా మారింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అన్నట్లుగా వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇటీవల కాలంలో వైసీపీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుబంధంగా మారిపోయారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో ఆ ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. అలాగే అభ్యర్థుల సర్థుబాటుపైనా ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా నెల్లూరు ఎంపీ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిపై వైసీపీ అన్వేషణ ఫలించినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించడం..వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయనున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఎవరు అనేదానిపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని అంశాలను పరిశీలించిన వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ తెలియజేసినట్లు సమాచారం. పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు సహకరించే అంశంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీరుపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ అభ్యర్ధిగా పోటీ చేస్తే పార్టీలో అసమ్మతితోపాటు అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నెల్లూరులో క్లీన్ స్వీప్ చేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ స్పష్టం చేసినట్లు నెల్లూరు పొలిటికల్ సర్కిల్ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.