cabinet
తెలంగాణ రాజకీయం

భారీ తాయిలాలతో కేబినెట్ అజెండా రెడీ

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. జులై 31వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అజెండా కూడా ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీపై కీలక ప్రకటన వచ్చేసింది. జులై 31 తేదీన మధ్యాహ్నం 2 గంటల కు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది.రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై మంత్రివర్గం చర్చించనుంది.

రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ లో చర్చిస్తారు.ఇదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారంగత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల్లో తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒకే రోజు 64.9 సెం.మీ. వర్షం కురిసింది. తెలంగాణలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతంగా నమోదైంది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఈ రికార్డు నమోదైంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల చరిత్రలో 2013 జులై 19న ములుగు జిల్లా వాజేడులో కురిసిన 51.75 సెం.మీ. వర్షం రికార్డుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వర్షపాతంగా నమోదై ఉంది. గురువారం దీన్ని మూడో స్థానానికి చేర్చేలా ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.9 సెం.మీ. కురిసింది.

కుండపోత వర్షాలతో రాష్ట్ర వర్షపాతంలో రోజు రోజుకు కొత్త రికార్డులు చేరుతున్నాయి. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ఒకేసారి నాలుగు చోట్ల కొత్త రికార్డులు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 61.8 సెం.మీ వర్షం పడింది. ఇది రాష్ట్ర చరిత్రలో రెండో అత్యధికంగా నమోదైంది. కొత్తగా భూపాలపల్లి జిల్లా చెల్పూరులో 47 సెం.మీ. వర్షపాతం, రేగొండలో 46 సెం.మీ. వర్షపాతంతో అయిదు, ఆరు గరిష్ఠ వర్షపాతాలుగా నిలిచాయి.2013 జులై 23న కొమురం భీమ్‌ జిల్లా దహేగాంలో కురిసిన 50.36 సెం.మీ వర్షపాతం 4వ స్థానంలో కొనసాగుతోంది. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో కురిసిన 43.1 సెం.మీ వర్షపాతం ఏడో స్థానంలో నిలిచింది. 2016 సెప్టెంబరు 24న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో కురిసిన 39.5 సెం.మీ. ఎనిమిదో స్థానంలో ఉంది. గురువారం వరంగల్‌ జిల్లా మొగుళ్లపల్లిలో 39.4, భద్రాద్రి జిల్లా కర్కగూడెంలో 39, కరీంనగర్‌ జిల్లా మల్యాల 38.5 సెం.మీ కురిసింది. ఇవి 9 నుంచి 11వ భారీ వర్షపాతాలుగా నిలిచాయి.

గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 36.3, ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 32.6, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో 31.2, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 31.1 సెం.మీ. వర్షం పడింది. రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో 20 సెం.మీ.కు పైగా వర్షం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 కేంద్రాల్లో 10 సెం.మీ.కుపైగా కురిసింది. ఈ స్థాయిలో వర్షాలు కురవడంతో గతంలో ఎన్నడు లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు