kadem
తెలంగాణ ముఖ్యాంశాలు

కడెం ప్రాజెక్టుకు 73 ఏళ్లు..... ముందుకు సాగని కుప్టీ ప్రాజెక్ట్

డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్ట్ అంటూ రెండు రోజులుగా వార్తలు వింటున్నాం. అసలు ఈ ప్రాజెక్ట్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఈ డ్యామ్ ను ఎప్పుడు కట్టారు..? అసలు కడెం డ్యామ్ చరిత్ర ఏంటో చూద్దాం…? కడెం ప్రాజెక్ట్…. గత రెండు మూడు రోజులుగా ఈ పేరు ప్రధానంగా వినిపి స్తోంది. సోషల్ మీడియాలో కూడా భారీగా వీడియోలు దర్శనమిస్తున్నాయి. డేంజర్ బెల్స్, డేంజర్ జోన్ లో కడెం అన్న వార్తలు ప్రధానంగా వచ్చాయి. గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈసారి అయితే ఓ దశలో గేట్లపై నుంచి నీళ్లు రావటంతో అధికారులు కూడా పరుగులు తీసిన సీన్ కనిపించింది. కొన్ని గేట్లు కూడా పని చేయకపోవటం కూడా చూశాం. వరదలు వచ్చిన ప్రతిసారి కూడా కడెం ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ను ఎప్పుడు కట్టారు..? ఏ ఉద్దేశ్యంతో నిర్మించారు..? గేట్లు తెగిపోయి… ప్రాజెక్ట్ కూలిపోయే పరిస్థితి ఎందుకు వస్తోంది.. అసలు కడెం ప్రాజెక్ట్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

కడెం డ్యామ్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలోని పెద్దూరు గ్రామం వద్ద నిర్మించారు. నిజానికి 1944లోనే నిజాం ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసింది. గోదావరి నదికి ఇది ఉపనదిగా ఉంటుంది. 1949లో పనులు ప్రారంభం కాగా… 1958లో పూర్తి అయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, మంచిర్యాల వంటి ప్రాంతాలకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు. దీనిని గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్ట్ గా కూడా పిలుస్తారు. అంతేకాకుండా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీన్ని నిర్మించినప్పుడు నీటి సామర్థ్యం 5.5 టీఎంసీలు కాగా… 9 గేట్లు ఉండేవి. అయితే 1958 సంవత్సరం ఆగస్టులో వచ్చిన భారీ వరదల దాటికి ప్రాజెక్ట్ భారీగా దెబ్బతిన్నది. 5 లక్షలకు పైగా క్యూసెకుల వరద రావటంతో గేట్లు కూడా తెగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం మరమ్మత్తులు చేపట్టింది. ప్రాజెక్ట్ ఎత్తు పెంచింది. డ్యామ్ సామర్థ్యాన్ని 7 టీఎంసీలకు పెంచుతూ… 18 గేట్లు ఏర్పాటు చేశారు.ఎడమ, కుడి కాలువల ద్వారా అనేక మండలాలకు నీరును అందిస్తుంది ఈ ప్రాజెక్ట్. కడెం, జిన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలకు ప్రధానంగా లబ్ధి చేకూరుతుంది.

ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరు… 6 కిమీ దాటిని తర్వాత గోదావరిలో కలిసిపోతుంది. దాదాపు ఈ ప్రాజెక్ట్ 69 వేల ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇక 1995లో కూడా కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద వచ్చింది. డ్యామ్ రెండువైపుల కోతకు గురైంది. 6 లక్షల క్యూసెకులకు పైగా వరద నీరు రావటంతో… డ్యామ్ కూలిపోతుందేమో అని భావించారు. మోటర్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. కానీ వరద ఉద్ధృతి తగట్టంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 2022లో వచ్చిన వరద సమయంలో కూడా కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుంచి బయటపడింది. మోటర్లు పూర్తి మునిగిపోయాయి. ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోలేదు. వరద ఉద్ధృతికి గేట్లు తెగిపోతాయని అనుకున్నారు. కానీ వరద నీరు తగ్గటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నిజానికి ప్రాజెక్ట్ నిర్వహణ కూడా అధికారులకు సవాల్ గా మారింది.

పొచ్చెర, కుంతాలతో పాటు అడవుల్లో ఉన్న చాలా వాగుల నుంచి ఈ ప్రాజెక్ట్ కు ప్రధానంగా నీరు వస్తుంటుంది. అయితే పై నుంచి ఎంత నీరు వస్తుందనే దానిపై ఎలాంటి అంచనాలు ఉండవు. దీంతో ప్రాజెక్ట్ కు ఏ సమయంలో ఎంత వరద ఉంటుందనేది అంచనా వేయటం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు గేట్ల నిర్వహణపై కూడా ఫోకస్ చేయకపోవటం కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణంగా మారింది. ప్రతి ఏడాది కూడా అరకొరగా నిధులు ఇవ్వటం అవి కాస్త… పైపై పనులకే సరిపోతున్నాయి. పూర్తి­స్థాయి మరమ్మతులకు సరిపడా నిధులు కేటాయించకపోవడంపై కూడా విమర్శలు తలెత్తున్నాయి.కడెం ప్రాజెక్ట్ పరిస్థితిపై ప్రభుత్వం కూడా దృష్టిపెట్టింది. గతంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారు. కుప్టీ దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పారు. 5 టీఎంసీలతో కుప్టీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే… కడెం ప్రాజెక్ట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

అందుకు అనుగుణంగానే 2015లోనే శంకుస్థాపన చేశారు. మొదట్లో రూ.900 కోట్లతో నిర్మాణ అంచనా వ్యయం ఉండగా.. సవరించిన డీపీఆర్ అంచనా ప్రకారం రూ. 1100 కోట్లకు పెంచింది సర్కార్. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే 18 వేల ఎకరాల సాగునీరు అందుతుంది. దీంతో పాటు మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, కడెం మండలాలకు నిరంతరం తాగునీటి సదుపాయాన్ని కల్పించవచ్చు. ఈ ప్రాజెక్ట్ పనులు అలాగే ఉండటం పట్ల స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి… కడెం ముంపు నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు