chilakaluripet
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సీఎం జగన్లా జేబులు నింపుకోవడంపైనే మంత్రి రజిని శ్రద్ధ -మాజీ మంత్రి ప్రత్తిపాటి చందాలతో ప్రజలే రోడ్లు నిర్మించుకునే పరిస్థితి తెచ్చారు అధ్వానంగా తయారైన బోయపాలెం

సీఎం జగన్ ఏవిధంగా జేబులు నింపుకునే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారో అదేవిధంగా మంత్రి రజిని కూడా ఏ పనులు చేస్తే డబ్బులు వస్తాయో వాటిపైనే శ్రద్ధ పెడుతున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శనివారం యడ్లపాడు మండలం, బోయపాలెంలో  ముస్లిం సోదరులందరూ మసీదు వద్దకు విచ్చేసి ప్రత్తిపాటి వచ్చిన సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి తదుపరి బోయపాలెం గ్రామంలోని చెరువులను తలపిస్తున్న రహదారులను పరిశీలించి మంత్రి రజినికి ప్రత్తిపాటి ఛాలెంజ్ విసిరారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలపడానికి బోయపాలెం-కొండవీడు రహదారి మచ్చుతునక మాత్రమేనని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎన్ని రహదారులు ఉన్నాయో.. వాటిలో ఎన్ని అధ్వానంగా ఉన్నాయో రజినికి తెలుసా అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. గడప గడపకు వెళ్తునప్పుడు ఈ రహదారులు కనిపించట్లేదా అన్నారు.

వైకాపా 4.5 ఏళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క రహదారినైనా వేశారేమో రజిని చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యమైన రహదారులు నిర్మించబట్టే నాలుగేళ్లుగా వైకాపా నేతలు వాటిపై తిరగగలిగారని ప్రత్తిపాటి అన్నారు. ప్రస్తుతం రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నా.. మంత్రి రజినికి కనిపించడంలేదా అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. యడ్లపాడు మండలంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయిని అన్నారు. రహదారుల దుస్థితిపై ప్రజలంతా తిట్టుకుంటున్నారని… గర్భిణీలు అయితే రహదారులపైనే ప్రసవించే పరిస్థితి వచ్చిందన్నారు. ఆటోలు, పొలాలకు వెళ్లే ట్రాక్టర్లు, ద్విచక్రవాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటున్నాయని తెలిపారు. రహదారులు మంజూరు చేయించి ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలనే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

చందాలు వేసుకుని ప్రజలే రహదారులకు మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారన్నారు. కొండవీడు కోటకు వెళ్లే రహదారికే మరమ్మతులు చేయలేకపోతే… ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించారు. తెదేపా హయాంలోనే కొండవీడు కోటకు వెళ్లే అప్రోచ్ రోడ్లను రెండు లైన్లుగా మంజూరు చేశామని.. వాటిని ఎందుకు రద్దు చేశారో మంత్రి రజిని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండవీడు కోటకు వెళ్లే రోడ్డునే వేయలేకపోతే.. కొండవీడు కోటను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మండిపడ్డారు. ఒక్క పని కూడా చేయకుండా.. ప్రజలను మోసం చేసిన ఏకైక ప్రజాప్రతినిధిగా రజిని చరిత్రలో నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. చెరువులను తలపిస్తున్న రహదారులకు, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించలేకపోయిన మంత్రి రజిని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు .

ఈ కార్యక్రమంలో రాష్ట్ర  పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి షేక్ కరిముల్లా గారు, యడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబు, కందిమల్ల రఘు రామారావు,  మద్దినేటి సుబ్బారావు, బోయపాలెం గ్రామ అధ్యక్షులు రాజు,  పలువురు  గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.