nitin-dil raju
తెలంగాణ రాజకీయం

నితిన్, దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. గెలుపుపై కన్నేసిన అన్ని పార్టీలు అభ్యర్థుల విషయంలో పక్కా స్కెచ్ వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు సినీ గ్లామర్‌పై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే పలువురు సినీ తారలను బీజేపీ పార్టీ తమ టచ్‌లోకి తీసుకోగా తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సైతం అదే స్ట్రాటజీతో ముందుకు సాగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టాలీవుడ్‌కు సంబంధించిన ఓ బడా ప్రొడ్యూసర్ వర్సెస్ హీరో మధ్య పోటీ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోంది. నిర్మాత దిల్ రాజు వర్సెస్ హీరో నితిన్ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు ‘భీష్మ’ సినిమా పంపిణీ వ్యవహారంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో దిల్ రాజుకు గొడవ జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.

దీంతో వీరిద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దిల్ రాజు చేసిన ప్రకటన సైతం వైరల్ అయింది. తాను రాజకీయాల్లోకి వెళ్తే ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఎక్కడి నుండైనా గెలుస్తానని కామెంట్ చేశారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావడం పక్కా అనే ప్రచారం తెరమీదకు వచ్చింది. హీరో నితిన్ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఓ సారి భేటీ అయ్యారు. ఆయన రాజకీయ ప్రవేశంపైనా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.దిల్ రాజు, నితిన్ ఇద్దరిది నిజామాబాద్ జిల్లానే కావడంతో వీరి పోటీపై జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరో నితిన్ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నప్పటికీ ఆయన మేన మామ పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. ఆ స్థానానికి తీవ్రమైన పోటీ ఉండటంతో ఆయన మేనల్లుడు నితిన్‌ను నిజామాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేయించాలని భావిస్తున్నారట.

ఇక్కడ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మధుయాష్కి పోటీ చేయని పక్షంలో ఈ స్థానంలో నితిన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక 2019 నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీచేసిన కల్వకుంట్ల కవిత బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిర్మాత దిల్ రాజును బరిలో నిలపాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది.