తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సీనియర్ నేత , బీఆర్‌ఎస్ ఎంపీ కే. కేశవరావు సమావేశం అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దీప్‌దాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి 24 గంటలు కాక ముందే కేకే నేరుగా సీఎంతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. అయితే ముందుగా విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరబోతున్నారని… తర్వాత తాను ఎప్పుడు పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకుంటానన్నారు. అందులో భాగంగానే నేడు సీఎం రేవంత్‌తో కేకే సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు చెప్పుకుంటున్నారు. అదే టైంలో కేకే చేరిక అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సోనియా గాంధీ ఆపాయింట్‌మెంట్ కోరినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారట.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేకే కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పాత్ర ఉంటుందనే ఆసక్తిగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న వారందరిలో చాలా సీనియర్ ఆయన. అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకురావడమే కాకుండా ఆయనకు తగిన రీతిలో గౌరవించాలని అనుచరులు అంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కేకే చేరిన తర్వాత జనరల్ సెక్రటరీ చేశారు కేసీఆర్. అంతే కాకుండా ఎంపీగా కూడా రెండుసార్లు అవకాశం కల్పించారు. ఇప్పుడు మరి కాంగ్రెస్‌లో ఎలాంటి పాత్ర ఉంటుందనేది ఆసక్తిగా మారింది.