sunil
తెలంగాణ రాజకీయం

30 స్థానాల్లో అభ్యర్ధులు కరువు

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలకు మరింత పదును పెడుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోష్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు మరింత కష్టపడుతున్నారు. అయితే ఇంత చేస్తున్నా రావాల్సిన మైలేజ్ మాత్రం రావడం లేదని.. ఇటీవల పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు అగ్ర నేతలకు చెప్పేరట.  ఇంకాస్త అగ్రెసీవ్‌గా వెళ్లకపోతే కష్టమే అంటూ సంకేతాలు ఇచ్చారట.. ఇంతకు కాంగ్రెసుకు సునీల్ ఇచ్చిన కొత్త డైరెక్షన్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి చెప్పాలంటే ప్రజంట్ బ్రేకులు లేని బండి లాగా దూసుకుపోతుంది కాంగ్రెస్. ముఖ్యంగా కర్ణాటక విజయం తర్వాత ఆ పార్టీలో ఎక్కడా లేని జోష్ కనిపిస్తుంది.

అయితే ఆ పార్టీ నేతలతో సమానంగా బ్యాక్ ఎండ్‌లో ఉండి ఎఫర్ట్స్ పెడుతున్నారు.. పార్టీ స్ట్రాటజిస్ట్ అండ్ టీమ్.  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు తెర వెనకాల చేయాల్సిన మంత్రాంగం అంతా చేసిన సునీల్ కనుగోలు తెలంగాణకు కూడా పనిచేస్తున్నారు.ఇప్పటికే సునీల్ కొనుగోలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనేక సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అయిన సునీల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారట. ఇందులో కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు బలహీనంగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన డీటైల్డ్ రిపోర్ట్‌ను ప్రజెంట్ చేశారు సునీల్. అయితే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మంచిగానే ఉన్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో ఇప్పటికపార్టీ బలమైన ప్రభావం చూపలేకపోతుందని సునీల్ చెప్పినట్టుగా తెలిసింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ కాస్త వీక్‌గా ఉండడంతో పాటు.. ఈ జిల్లాలో కనీసం 30 స్థానాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరనే విషయాన్ని సునీల్ కొనుగోలు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కాంగ్రెస్ నాయకులకు చెప్పారట.ఈ 30 నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి కానీ లేకపోతే బలమైన అభ్యర్థులను తీసుకొని వచ్చి పెట్టకపోతే కాంగ్రెస్ విజయ అవకాశాలు తగ్గుతాయని సునీల్ కొనుగోలు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

దీంతో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఈ 30 నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడ బలమైన అభ్యర్థులను వెతికి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రావడం ఇప్పుడు కాంగ్రెస్ నేతల ముందు ఉన్న సవాల్.. చూడాలి మరి ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తుందో..!