తెలంగాణ స్టేట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఏడాది పూర్తయింది. 365 రోజుల్లో ఎన్నో సంచలన కేసుల ట్రేసింగ్ తో పాటు సాంకేతికంగా తెలంగాణ పోలీస్ స్థాయిని మరో మెట్టుకు ఎదిగేలా చేసింది తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. సరిగ్గా ఏడాది క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇదే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఏడాది వ్యవధిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా మన కమాoడ్ కంట్రోల్ సెంటర్ కు మంచి గుర్తింపు లభించింది. వివిధ రాష్ట్రాల ఐపీఎస్ లు సైతం ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడి నుండి జరుగుతున్న కార్యకలాపాలకు గురించి వివరాలు తెలుసుకొని వారి రాష్ట్రాల్లో సైతం ఇలాంటి విధానాలను అనుసరించారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది సీసీ కెమెరాలను అనుసంధానం చేసే డేటా సెంటర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు గుండెకాయ లాంటిది. ప్రస్తుతం డేటా సెంటర్ ద్వారా కొన్నిటికే పరిమితమైన మానిటరింగ్ త్వరలో పూర్తిస్థాయిలో ఈ డేటా సెంటర్ పనిచేయనుంది.. ఇప్పటికే ఈ డేటా సెంటర్ కోసం జర్మనీ నుండి అత్యాధునిక పరికరాలను సైతం దిగుమతి చేసుకున్నారు. డేటా సెంటర్ పూర్తిస్థాయిలో వినియోగానికి వస్తే రాష్ట్ర నలుమూలల, నలు దిక్కుల ఏ చిన్న ఘటన జరిగిన సరే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సమాచారం చేరవేస్తుంది. ప్రస్తుతం డేటా సెంటర్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి..బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా మారింది. హైదరాబాదులో ఉన్న ఎత్తైన ప్రభుత్వ భవనాల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఒకటి. సుమారు 20 అంతస్తుల లో నాలుగు టవర్లుగా నిర్మించారు.. ప్రస్తుతం ఒక టవర్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.
ఏడాది వ్యవధిలో దేశం మొత్తం తెలంగాణ పోలీస్ వైపు చూసేలా ఇక్కడి నుండి వ్యవస్థ పని చేసింది. ముఖ్యంగా సంచలన కేసులుగా ఉన్న 712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేస్ తోపాటు నేపాలి దొంగలను చేదించడంలో, డ్రగ్స్ కేసుల్లో , ఎన్నో సైబర్ క్రైమ్ కేసుల చేధనల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతో ఉపయోగపడింది.హైదరాబాదులో ఏ పండుగ వచ్చినా సరే పోలీసులు అదనపు అలర్ట్ గా ఉంటారు. ముఖ్యంగా బోనాలు, మొహరం, రంజాన్, శ్రీరామనవమి శుభరాత్రి, వీర హనుమాన్ ర్యాలీ వంటి పండుగలు ఇలాంటి ఘటన లేకుండా ప్రశాంతంగా జరిగాయి అంటే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జరిగిన మానిటరింగ్ ప్రధాన కారణం. ఉత్సవ వేడుకల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటన్నిటిని మెయిన్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయడంతో ఎప్పటికప్పుడు అక్కడి అప్డేట్స్ ఫాలో అవుతూ ప్రతి పండుగను కూడా శాంతియుతం గా నిర్వహించారు పోలీసులు..పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తర్వాత ఇందులో మరో రెండు కొత్త వింగ్ లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న సైబర్ క్రైమ్ కేసులో చేతన కోసం (తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) ను ఏర్పాటు చేసింది.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చాప కింద నీరుల విస్తరిస్తున్న డ్రగ్స్ ను ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.. ఈ రెండు విభాగాలకు సంబంధించిన కార్యాలయాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే ఏర్పాటు చేశారు.రానున్న రోజుల్లో ఎలాంటి విపత్తు ఎదురైనా , కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర డిజిపి తో పాటు ముఖ్యమంత్రి, ఇతర శాఖల సిబ్బందికి పలు ఫ్లోర్లను కేటాయించారు.. 20 అంతస్తుల పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీడియో పోస్ట్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.