అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో…అధికార బీఆర్‌ఎస్‌లో మునుపెన్నడూ లేని కొత్త తరహా వాతావరణం కనిపిస్తోంది. ఇన్నేళ్ళు అధిష్టానం ఎంపిక చేసిన వాళ్ళే అభ్యర్థులు, వాళ్ళు ఇచ్చిందే టిక్కెట్. కానీ… ఇప్పుడు మాత్రం పార్టీలో అసమ్మతి స్వరాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే…. అధినాయకత్వానికే అల్టిమేటమ్ ఇచ్చే రేంజ్‌లో ఉన్నాయట అసంతృప్త స్వరాలు. సిట్టింగ్‌ని మీరు పీకేస్తారా? లేక టిక్కెట్ ఇచ్చాక మమ్మల్నే పీకమంటారా అంటూ ఓ రేంజ్‌లో వాయిస్ పెంచుతున్నట్టు తెలిసింది. అధిష్టానం ఆల్రెడీ ఎంపిక కసరత్తు మొదలుపెట్టేసిందని, ఈనెలలోనే తొలి జాబితా విడుదల ఉంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా…. దెబ్బై పోతామనుకుంటూ కార్యకలాపాలు ముమ్మరం చేశారట వివిధ నియోజకవర్గాల్లో అసంతృప్తులు.
ఓవైపు సిట్టింగ్‌లకే సీట్లని అధిష్టానం అంటున్నా… అదంతా జాన్తా నై. మేం చెప్పినట్టు చేయకుంటే.. తర్వాత జరిగే పరిణామాలకు మా బాధ్యత లేదంటూ చెలరేగిపోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. కొన్ని చోట్ల అసంతృప్తులంతా ఒక్కటై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లాబీయింగ్ మొదలుపెడితే…. మరికొన్ని చోట్ల ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారట.చొప్పదండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి స్వరాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ రిజర్వ్‌డ్ స్థానంలోని మూడు మండలాల్లో వెలమ, రెడ్లకు, ఒక మండలంలో బీసీ నాయకులకు గట్టి పట్టుంది. అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపుదాకా తెరవెనక పాత్ర వీరిదే ఉంటుంది. ఈ లాబీనే గతంలో సిట్టింగ్‌గా ఉన్న బొడిగె శోభకు కాదని రవిశంకర్‌కు టిక్కెట్ ఇప్పించిందన్నది లోకల్ టాక్.
గెలిచాక రవిశంకర్ కూడా తమ మాట వినడం లేదంటూ… ఇప్పుడు బండపల్లి యాదగిరికి ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. రవిశంకర్ ఎమ్మెల్యే అయ్యాక తమలో తమకే తంపులు పెట్టే ప్రయత్నం చేశారన్నది ఆ లాబీ ప్రధాన ఆరోపణ. అటు రామగుండంలో కోరుకంటి చందర్‌కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ గట్టిగానే మాట్లాడుతున్నారట అసమ్మతి నాయకులు. ఇక్కడ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, కార్పొరేటర్ దంపతులు టిక్కెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఐదుగురూ కలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పాదయాత్ర సైతం చేసి కలకలం రేపారు. తాజాగా ఈ గ్రూప్ నుంచి మరో ప్రతిపాదన కూడా గులాబీ అధిష్టానానికి వెళ్ళినట్టు తెలిసింది. మాలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇచ్చినా… అంతా కలిసి పని చేస్తాం తప్ప సిట్టింగ్‌కి మాత్రం ఇవ్వవద్దని అంటోందట అసమ్మతి వర్గం. ఇక మహబూబాబాద్‌లో శంకర్ నాయక్‌కు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి.
కేడర్‌ని అస్సలు పట్టించుకోవడం లేదని, ఆయనకు సీటిస్తే.. సహకరించే ప్రసక్తే లేదంటున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.ఇటు కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ కు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దని నేతలు అంతా ఒక్క తాటిపైకి వచ్చారు. అవసరమైతే… ఆయన మీద స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామంటోంది అసమ్మతి టీమ్. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే జైపాల్ కో హటావో , కల్వకుర్తి బీఆర్ఎస్ కో బచావో అంటూ నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులంతా సమావేశమవడంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొన్ని చోట ఇలాంటి వాతావరణమే ఉంది.కోదాడ లో కూడా అదే పరిస్థితి ఉంది. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ని మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఆయన స్థానంలో తన పేరు పరిశీలించమని అడుగుతున్నారట పెరిక సామాజిక వర్గానికి చెందిన వనపర్తి లక్ష్మీనారాయణ. ఇప్పటికే ఆయన భార్య శిరీష కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో తన సామాజికవర్గ ఓట్లు ఎక్కుగా ఉన్నందున తనకే టిక్కెట్ ఇవ్వాలన్నది ఆయన డిమాండ్ అట. దేవర కొండలో రవీంద్ర నాయక్‌కు మళ్ళీ ఛాన్స్ ఇవ్వవద్దని ఆ నియోజకవర్గ నేతలు అధిష్టానాన్ని కోరడం కూడా గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది. ఇలా ఎక్కడికక్కడ సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వవద్దంటూ అసమ్మతి వర్గాలు బలపడటం, సవాల్ విసిరే స్థాయిలో మాట్లాడటం చూస్తుంటే… పార్టీలో కొత్త కల్చర్ పెరుగుతున్నట్టు ఉందంటున్నారట సీనియర్ లీడర్స్. అసమ్మతులను అధిష్టానం బుజ్జగించి దారికి తెచ్చుకుంటుందా లేక తొక్కిపెడుతుందా అన్నది చూడాలంటున్నారు పార్టీ లీడర్స్.