తెలంగాణ రాజకీయం

స్థానిక సమస్యలే అజెండాగా కాంగీ రేసు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఇన్‌చార్జ్‌‌లకు హైకమాండ్ కీలక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలు, పరిష్కారాలపై ఎక్కువ స్పందించాలని పార్టీ సూచించింది. లోకల్ ఇష్యూస్‌పై ఫోకస్ పెట్టి ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నది.ఈ మేరకు నియోజకవర్గాల వారీగా కీలక సమస్యలు, పరిష్కార మార్గాలపై నివేదికలు ఇవ్వాలని డీసీసీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌‌లను టీపీసీసీ కోరింది. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా స్థానిక అంశాల్లోని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపగలిగితే జనాల నుంచి మద్ధతు లభిస్తుందని పార్టీ భావిస్తున్నది.

ప్రతి నియోజకవర్గంలో రీసెర్చ్ చేసి లాంగ్ స్టాండ్ ఇష్యూస్‌ను పసిగట్టి, అందుకు కారణాలు, చెక్ పెట్టేందుకు ప్రణాళికలు వంటివన్నీ కనుగొనాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ థాక్రే సైతం నేతలకు సూచించారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఇష్యూస్‌‌పై స్టేట్ కమిటీలు స్పందించనున్నాయి. ప్రచార కమిటీలు, టీపీసీసీలు, క్యాంపెయిన్ కమిటీలతో పాటు ఇతర అనుబంధ సంఘాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఓవరాల్ సమస్యలపై దృష్టి పెట్టనున్నాయి. అంతేగాక మేనిఫెస్టో, ఇతర హామీలన్నీ ఈ స్టేట్ కమిటీలే ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్‌‌లో ఏఐసీసీ, టీపీసీసీ స్టేట్ లీడర్లు, కమిటీ నాయకులు నియోజకవర్గాల్లో వివరిస్తారుఅప్పటి వరకు లోకల్ సమస్యలతో జనాలకు కలుగుతున్న ఇబ్బందులు, ఎమ్మెల్యే వైఫల్యాలను ఆయా అసెంబ్లీ సెగ్మెంట్‌ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లే ప్రతి ఇంటికీ చేరవేయాలని పార్టీ నొక్కి చెప్పింది.

ఎన్నికల క్యాంపెయిన్‌లో మాత్రం నియోజకవర్గం సమస్యలను సెగ్మెంట్‌ల వారీగా హైలెట్ చేస్తూ.. ఓవరాల్ ఇష్యూస్‌ను నార్మల్‌గా వివరించాలని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తీర్మానించినట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. దీంతోపాటు ఎన్నికల ప్రచారం మొదలు కాగానే ‘ఒక్క చాన్స్’ అనే మరో అస్త్రాన్ని విరివిగా వాడాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తున్నది. గతంలో అనేక ఎన్నికల్లో ఈ పదం వినియోగించిన పార్టీలకు మంచి ఫలితాలు వచ్చినట్లు సీనియర్ నేతలతో పాటు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఇన్‌చార్జ్‌లకు ఈ కొత్త విధానం ఫాలో అవ్వాలని హైకమాండ్ సూచించింది. సాధారణంగా పార్టీ ఓవరాల్ మేనిఫెస్టోను మాత్రమే అన్ని చోట్ల ప్రచారం చేసుకుంటూ ఎన్నికలకు వెళితే.. కొన్ని నియోజకవర్గాల్లో జనాల మద్దతు లభించడం లేదని పార్టీ గుర్తించింది.

గతంలో జరిగిన ఎన్నికల్లో దీనిపై కాంగ్రెస్ స్డడీ కూడా చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఉపఎన్నికలు, సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కామన్ విధానం, మేనిఫెస్టోతో వెళ్లడం వలన నష్టం జరిగిందని ఆలస్యంగా గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేసి ఈ నిర్ణయానికి వచ్చింది. పైగా స్థానిక సమస్యలపై జనాల ఇంట్రస్ట్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో ఇక నుంచి ‘స్థానిక సమస్యలు ఫస్ట్.. ఓవరాల్, కామన్ ఇష్యూస్ నెక్ట్స్’ అనే విధానాన్ని అనుసరిస్తే అభ్యర్థికి ఎక్కువ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. సెగ్మెంట్‌ల వారీగా దృష్టి పెడితే ఎక్కువ సీట్లు సాధించగలమని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ విధానాన్నే అవలభించిందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.