ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఆంధప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని, తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీన్ని సరిదిద్దడానికే జూరాల ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు.
ఏపీ నిర్మిస్తున్నవి అక్రమ ప్రాజెక్టులని, తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులని మంత్రి వెల్లడించారు. ఆనాడు ఏపీ జలదోపిడీకి సహకరించినవాళ్లే.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో జోగులాంబ బరాజ్‌ను ప్రతిపాదించారని వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని, నీటి కేటాయింపులు జరిపించుకోవాలని చెప్పారు.
దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు అందించామని వెల్లడించారు. రైతుబంధు కింద రూ.7360 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 10 ఎకరాలకు పైబడినవారికి రైతుబంధు రూ.600 కోట్లు మాత్రమే ఉన్నారని చెప్పారు.