నగరం నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే తన గుండె సంతోషంతో ఉప్పొంగి పోయిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేడ్కర్ నగరంలో నూతనంగా నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవాళ ఉదయం మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇంత అద్భుతమైన ఇండ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే స్థలంలో ప్రయివేటు అపార్ట్‌మెంట్ కట్టి ఉంటే కోటిన్నర అయి ఉండేదని, కానీ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఇండ్లు నిర్మించి ఇచ్చారు అని ఆడబిడ్డలు చెబుతున్న మాటలతో గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇల్లు కట్టాలన్న, పెళ్లి చేయాలన్న కష్టంతో కూడుకున్న పని. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఇల్లు కట్టించి ఇచ్చి, ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తున్నారు. పేదల కోసం ఇండ్లు కట్టించి ఇస్తున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా కూడా లేదు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రూ. 9 వేల కోట్లతో ఇండ్లు కట్టించి ఇస్తున్న నగరం భారతదేశంలో హైదరాబాద్ ఒక్కటేనని తెలిపారు. పారదర్శకంగా ఇండ్ల పంపిణీ జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
బస్తీ దవఖానా, ఫంక్షన్ హాల్ నిర్మిస్తాం
అంబేడ్కర్ నగర్ వాసులకు బస్తీ దవఖానాతో పాటు ఫంక్షన్ హాల్ నిర్మించి ఇస్తాం. అవసరమైతే ఇంకొన్ని ఇండ్లు కట్టిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రజల నుంచి ప్రభుత్వం ఆశించేది రెండు పనులు మాత్రమే అని స్పష్టం చేశారు. ఒకటి పరిశుభ్రత, రెండోది పచ్చదనంపై దృష్టి ఉంచాలన్నారు. ముఖ్యమంత్రికి చెట్లంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తెలంగాణలో 23 నుంచి 28 శాతానికి పచ్చదనం పెరిగిందన్నారు. ఇంకా హైదరాబాద్ నగరంలో చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంచే బాధ్యతను ఆడబిడ్డలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మురికికూపంగా ఉండేది. ఇప్పుడిప్పుడే దాన్ని బాగు చేసుకుంటున్నాం. సాగర్ పరిసరాల్లో చెత్త వేయనీయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నగరాన్ని, మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అంబేడ్కర్ నగర్ మోడల్ కాలనీగా తయారు కావాలని కేటీఆర్ అన్నారు.