sim scam
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

బెజవాడలో సిమ్ స్కామ్

ఒక్క ఫోటోపై ఏకంగా  658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. బెజవాడ లోని గుణదలతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సిమ్ కార్డులతో అసలేం చేస్తున్నారో కనిపెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్  ఫిర్యాదు మేరకు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్వయంగా విచారణ చేపట్టారు. సూర్యారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.  పోలీసుల దర్యాప్తు లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు అన్ని సిమ్ కార్డులు జారీ చేశారు, అందులో కారణాలు, ఎంటి అనే విషయాలతో పాటుగా కుట్ర కోణంలో కూడ దర్యాప్తు చేపట్టారు. సిమ్ కార్డు జారి అయిన వ్యక్తి ఫోటో ఆదారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదార్ , పాన్ లింక్ లను సేకరించి సాంకేతిక ఆధారాలను గురించి వాకబు చేస్తున్నారు.

ఒకే ఫొటోతో ఒకటే నెట్ వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్ లను అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్లు గుర్తించారు.ఇదే తరహాలో అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయినట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు పంపి, వాటికి సంబంధించిన ఆధారాలు ఇంకా ఎమయినా ఉన్నాయా అనే విషయాలు సేకరిచటంతో పాటుగా, నెట్ వర్క్ సంస్దలకు పోలీసులు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఆయా నెట్ వర్క్ సంస్దల యాజమాన్యాలను  అలర్ట్ చేయటంతో పాటుగా తగిన సమాచారాన్ని అందించేందుకు మెయిల్స్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నారు.సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలికమ్యునికేషన్ల శాఖ కృత్రిమ మేధస్సుతో పని చేసే  టూల్ కిట్ ను వినియోగించింది.

ఈ విధానం ద్వారా సిమ్ కార్డులను పూర్తి స్దాయిలో పరిశీలించవచ్చు. అంతే కాదు ఆయా నెట్ వర్క్ ల కు చెందిన సిమ్ కార్డులను వడపోయటంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబైబర్ వెరిఫికేషన్,  సాఫ్ట్వేర్ ద్వారా సిమ్ కార్డు మోసాలను గుర్తించి, సంబంధిత నంబర్లను బ్లాక్ చేయటంలో  అధికార యంత్రాంగం ముందుంది. అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్ కార్డుదారులకు చెందని ఫోటోలు, ఇతర ఆధారాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి విలువయిన డేటాను వెళ్ళకుండా జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఇలాంటి చర్యల్లో భాగంగా నిర్వహించిన తనఖీల్లో ఒకే ఫొటోతో పెద్ద ఎత్తున సిమ్ లు తీసుకున్న విషయం బయటకు వచ్చింది.

నకిలీ పత్రాలతో జారీ అయిన సిమ్ కార్డులు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లే పరిస్దితులు ఉన్నాయి, ఇటీవల కాలంలో హనీ ట్రాప్ లు కూడ వెలుగులోకి రావటంతో సాంకేతికంగా వస్తున్న మార్పులను కూడ ప్రభుత్వ రంగ సంస్దలు పరిశీలిన జరుపుతున్నాయి.  ఈ సిమ్ లు ఎక్కడికి వెళ్లాయి, ఎవరు వినియోగిస్తున్నారు అనే అంశాలు పై కూడ దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా సిమ్ కార్డుల కాల్ లిస్ట్ లను కూడ సేకరించటం ద్వార దర్యప్తు వేగవంతం అవుతుందని విచారణ అధికారులు భావిస్తున్నారు.