bjp-janasena
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బీజేపీతో కలిసి జనసేన పంచాయతీ పోరు - ఇక కలసి పోరాటాలు

ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఉన్నా రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నది లేదు.  కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.  జనసేన నేతలు కూడా బీజేపీ ధర్నాల్లో పాల్గొంటున్నారు.  సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది. గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో  పాటు, ఉభయ పార్టీల నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు.  ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో పలువురు పాల్గొన్నారు.  జనసేన – బీజేపీ కలిపి తిరుపతి ఉపఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.

అయితే అనుకున్న ఫలితం రాలేదు. ఆ తర్వాత నుంచి రెండు పార్టీలు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ పోటీ చేసినప్పటికీ..త జనసేన పార్టీ బహిరంంగంగా మద్దతు ప్రకటించలేదు. అదే సమయంలో జనసేన పార్టీ.. ఓట్లు చీలనివ్వబోమని ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని చెబుతూ వస్తోంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి చర్చించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నందున రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని బీజేపీ అగ్రనేతలు సూచించారు. ఈ మేరకు జనసేన అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి నేతలకు సూచనలు అందినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి జనసేనతో సమన్వయం చేసుకుంటామని చెబుతూ వస్తున్నారు.

ఇప్పటి వరకూ   ఢిల్లీ పెద్దలు తప్ప.. రాష్ట్ర బీజేపీ నాయకులతో పెద్దగా సంబంధాలు లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతుంటారు. అంతేకాదు బీజేపీ-జనసేన కలిసి రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. ఒక్క తిరుపతి ఉపఎన్నికల్లో తప్ప.. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి నిర్వహించిన కార్యక్రమాలు కూడా లేవు. కానీ ఇకపై అలా ఉండదని ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు. జనసేన తమకు మిత్రపక్షమని.. ఆపార్టీతో ఇకపై రెగ్యులర్ గా సంప్రదింపులు, ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుందని పురంధేశ్వరి స్పష్టంచేశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడానని చెప్పిన పురంధేశ్వరి.. త్వరంలో నేరుగా భేటీ అవుతానని అన్నారు.

అయితే, ప్రభుత్వంపై పోరాటాల విషయంలో ఎవరికి వారు విడివిడిగా ఉద్యమాలు చేసినప్పటికీ.. సమయానుసారం కలిసి ముందుకెళ్తామన్నారు. వేర్వేరుగా ప్రజా ఉద్యమాల ద్వారా పార్టీలు బలోపేతం చేసుకోవల్సి ఉందన్నారు. ఆ ప్రకారం ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోరాటాల్లో పాల్గొంటోందని అంచనా  వేస్తున్నారు. నిధులు ఇచ్చే వరకు పోరాటం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో సర్పంచ్లు బిల్లులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు.   కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు నిరసనకు పిలుపునిచ్చింది.

ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్ను తుంగలో తొక్కిందని ఆరోపించారు. గ్రామాల్లోని ప్రజల అవసరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అంతేకాదు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ది పనులు జరగడం లేదని దగ్గుబాటి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామాల్లో సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కనీస వసతులు కల్పించిన సర్పంచ్లు, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారన్నారు. కనీసం వారి బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం అన్యాయం అన్నారు. సొంత డబ్బులతో కాంట్రాక్ట్ పనులు చేసిన సర్పంచ్లు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారని అన్నారు.

సర్పంచ్ల ఆత్మహత్యల పాపం సీఎం వైఎస్ జగన్ది కాదా అని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సర్పంచ్ల పోరాటానికి బీజేపీ మద్దతు ప్రకటించడంతో రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు పంచాయతీల నుంచి పెండింగ్లో ఉన్న కరెంటు చార్జీల పేరుతో ఆ రూ.1000 కోట్ల నుంచి రూ.600 కోట్లు కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోత పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కృతమయ్యే వరకు… గ్రామ పంచాయతీల వ్యవస్థ మెరుగపరచడంతో పాటు దారి మళ్లించిన నిధులను తిరిగి చెల్లించే వరకు పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.గ్రామ సర్పంచ్లు ఏళ్ల తరబడి నిరసనలు చేస్తుంటే సీఎం జగన్ ఒక్కసారైనా స్పందించారా అని పురంధేశ్వరి నిలదీశారు.

సీఎం వైఎస్ జగన్ ఎంతసేపు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల గురించే పదేపదే ప్రస్తావిస్తున్నారని కానీ పంచాయతీ వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు నిలదీశారు. పెట్టి సర్పంచులు పనులు చేస్తున్నారని.. బిల్లులు రాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన సుమారు రూ.8000 కోట్లను స్వాహా చేసిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద  బీజేపీన నేతలు ధర్నాలు చేశారు.