ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల వైఖరి ఆసక్తిగా మారింది. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంలో రోజుకో వాదన తెరమీదకు వస్తోంది. తాజాగా.. షర్మిల పార్టీ విలీనం అంకం తుది దశకు చేరుకుందని, వారం రోజులుగా డీకే శివకుమార్‌తో షర్మిల చేస్తున్న చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది ఇక ఫైనల్‌గా అధిష్టానాన్ని కలిసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ విలీనంపై మరింత స్పష్టతతో పాటు తన డిమాండ్లను హైకమాండ్ వద్దే తేల్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన పార్టీనీ విలీనం చేయడం ద్వారా కాంగ్రెస్‌లో తన ప్రయార్టీ ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి? తన వర్గానికి సీట్లపై ఏదైనా హామీ ఇస్తారా? అనే అంశాలపై క్లారిటీ తీసుకోబోతున్నారని తెలుస్తోంది.షర్మిల పార్టీ విలీనం కాబోతున్నదనే చర్చ చాలా కాలంగానే జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వాదనకు బలం చేకూరేలా షర్మిల కూడా తన పార్టీ ద్వారా ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం లేదు.
దాంతో వైఎస్సార్ టీపీ రోజురోజుకూ ఇన్‌యాక్టివ్ అనేలా పరిస్థితి మారింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ విషయంలో షర్మిల వైఖరిలో మార్పు పార్టీ విలీనంపై అనుమానాలను బలపరుస్తోంది.పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం దాదాపు ఖాయం కావడం వల్లే రాహుల్ గాంధీ విషయంలో షర్మిల రియాక్ట్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.లంగాణలో తాను పార్టీ స్థాపించిన తర్వాత.. సుదీర్ఘమైన పాదయాత్రను కొనసాగిస్తూ.. కేసీఆర్ సర్కారు మీద నిశిత విమర్శలతో విరుచుకుపడిన ధైర్యం షర్మిల సొంతం. ఆమె పట్ల ప్రభుత్వమూ, పోలీసులూ అమానుషంగా ప్రవర్తించినప్పుడు సాక్షాత్తూ ప్రధాని కూడా ఫోనుచేసి పరామర్శించిన హైప్రొఫైల్ కూడా ఆమె సొంతం. ఆ రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఆమె ప్రకంపనలు సృష్టించారు. కర్నాటకలో పార్టీ గెలిచిన నాటినుంచి.. షర్మిల కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతూ ఉంది. ఆమె వాటిని ఖండించడం లేదు.
అయితే ఏపీలో పార్టీ బాద్యతను కూడా చూడాల్సి ఉంటుందని కాంగ్రెస్ కండిషన్ పెడుతున్నట్టుగా ప్రచారం ఉంది. మధ్యలో తన సొంత అన్న జగన్ కు గ్రీటింగ్స్ చెప్పడం గురించి కూడా ఇటీవలి కాలంలో పట్టించుకోవడం మానేసిన షర్మిల రాహుల్ పుట్టినరోజు నాడు మాత్రం ఘనంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక మెట్టు దిగారు. ఆమె పార్టీ విలీనం వార్తలు మరింత జోరందుకున్నాయి.తాజాగా రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ అయినందుకు షర్మిల, కాంగ్రెస్ నాయకుల కంటె అతిగా మురిసిపోతున్నారు. న్యాయం ధర్మం గెలిచాయనడానికి సుప్రీంకోర్టు తీర్పే ఒక ఉదాహరణ అని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించడం విశేషం. రాహుల్ గాంధీ పార్లమెంటుకు తిరిగి రావడం దేశానికి ఎంతో అవసరం అని, పార్లమెంటులో ఆయన గళం వినడం కోసం దేశం ఎదురుచూస్తోందని శ్లాఘించారు. ఆయనను ఆమె పొగడుతున్న తీరు గమనిస్తే.. కాంగ్రెసులో విలీనం కావడానికి గ్రీన్ సిగ్నల్ కోసం ఆమె రాజీపడడంలో అన్ని మెట్లూ దిగేసినట్టేనని.. రాహుల్ దయ కోసం ఎదురుచూస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.
షర్మిల ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే ఆమె సేవలు ఏపీకా? తెలంగాణకా? విలీనం చేస్తే ఎక్కడి నుండి పోటీ చేస్తారు? అనే ప్రశ్నలు టీ కాంగ్రెస్ శ్రేణులను ఆలోచనలో పడేస్తోంది.షర్మిల మనసులో మాట ఎలా ఉన్నా.. ఆమె చేరికను మాత్రం టీ కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. షర్మిల చేరికతో పార్టీకి లాభం కంటే నష్టమే జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల చేరిక విషయం తన వద్దకు ప్రస్తావనకు రాలేదని, ఈ విషయం తెలంగాణకు సంబంధం లేనిదని పార్టీలోని అత్యంత ముఖ్యనేత పదేపదే చెబుతుండటం సస్పెన్స్‌గా మారింది.