భారత్ మొట్టమొదటిసారి సూర్యుడిపై పరిశోధన చేసే ఉద్దేశంతో చేస్తున్న ప్రయోగం ‘ఆదిత్య ఎల్-1’ కు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ఇప్పటికే తయారు కాగా, అది బెంగళూరులోని ఉడుపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి తాజాగా చేరిందని ఇస్రో ప్రకటించింది. ఆదిత్య ఎల్ – 1 కు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ ను భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎల్ – 1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ఇది అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. అక్కడి నుంచి సోలార్ విషయాలు, స్పేస్ వెదర్ ను అక్కడి నుంచి రియల్ టైంలో అందించనుంది. సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై పరిశోధనలు చేస్తుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌ను స్టడీ చేసేందుకు ఏడు పేలోడ్స్‌తో ఆ స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తుంది. సూర్యుడి ఉపరితలాన్ని కూడా స్టడీ చేయనున్నారు.
చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన కొన్ని వారాల్లోనే ఈ పరీక్షను చేపట్టనున్నారు. ఆదిత్య ఎల్ – 1 శాటిలైట్ సుమారు 1,500 కిలోల బరువు ఉంటుంది. ఏపీలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు. సెప్టెంబరులో మొదట్లో ఈ ప్రయోగం ఉండనుంది.ఆదిత్య ఎల్ – 1 మొత్తం ఏడు పేలోడ్లను కలిగి ఉంటుంది. ఇందులో ప్రధానమైంది విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ VELCతో పాటు సోలార్ అల్ట్రావాయ్లెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెర్మెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్ – 1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు. సూర్య గోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని నిరంతరం అధ్యయనం చేయడానికి వీలుగా ఈ పేలోడ్‌లను తయారు చేసి రూపొందించారు.
ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొరలు, సౌర శక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలిస్తాయి. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని పరిశీలించనున్నాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్ – 1 పాయింట్ వద్ద కణాలు, క్షేత్రాలకు సంబంధించి పరిశీలనలు చేయనున్నాయి.