జమ్మూకశ్మీర్‌లో సామాన్య ప్రజానీకంపై ఉగ్రమూకలు కాల్పులు జరిపిన పలుఘటనలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఇలా సామాన్యులపై దాడులు జరిగిన కేసులపై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) విచారణ చేపట్టనుందని సమాచారం.
జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి నాలుగు కేసులను ఎన్‌ఐఏ హస్తగతం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మృతుల్లో స్థానికేతరులు ఐదుగురు ఉన్నారు. తాజాగా కుల్గాంలో ఇద్దరు స్థానికేతర కూలీలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ క్రమంలో కశ్మీర్ లోయలో పనిచేస్తున్న స్థానికేతరులను పోలీసులు దగ్గరలోని సెక్యూరిటీ క్యాంపులకు తరలించారు.
ఇలా సామాన్య ప్రజానీకంపై ఉగ్రదాడులతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అయితే ఇలా ప్రజలపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులను వదిలిపెట్టబోమని, కచ్చితంగా ప్రజలు చిందించిన రక్తానికి ప్రతీకారం చేసి తీరుతామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించిన సంగతి తెలిసిందే.