పల్లెప్రగతి నేపథ్యంలో వేగంగా పూర్తికానున్న పనులు
పల్లెప్రగతి నేపథ్యంలో గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఉపాధి హామీ పనుల కింద ప్రభుత్వం రూ.1432.85 కోట్లను విడుదల చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీచేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఈ నిధులను విడుదల చేశారు. 2021-22 బడ్జెట్‌లో రూ.768.75 కోట్లు కేటాయించగా అదనంగా మరో రూ.671.10 కోట్లు.. మొత్తంగా రూ.1,432.85 కోట్లు విడుదల చేశారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనుల్లో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఈ నిధులు విడుదలయ్యాయి. వీటితో పనులు త్వరితగతిన పూర్తి కానున్నాయి. ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, మొక్కల పెంపకం, నర్సరీలు, రైతు కల్లాలు, రైతు వేదికలు తదితర కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టింది. వీటన్నిటికి చాలావరకు నిధులు విడుదల కాగా మిగిలిన వాటికి సంబంధించిన మొత్తం తాజాగా విడుదలవుతున్నది. పనుల వేగవంతానికి వీలుగా ఉపాధిహామీకి పెద్దఎత్తున నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల పనిదినాలు పూర్తి చేయగలిగామని తెలిపారు.