- గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి
- గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు
- ఏ ఒక్క పని పెండింగ్‌లో ఉండొద్దు
- దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ
- రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి
- విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే
- రైతుకు, సాగుకు యంత్రాంగం అండగా ఉండాలి
- ‘పోడు’ పరిష్కారానికి సమగ్ర నివేదిక ఇవ్వండి
- కల్తీవిత్తనాలపై కఠినంగా వ్యవహరించండి
- పీపీసెజ్‌ల చుట్టూ బఫర్ జోన్ల ఏర్పాటు
- బఫర్‌జోన్లలో లేఔట్లకు అనుమతులు నో
- మండలానికి పదెకరాల్లో ప్రకృతివనం
- కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చదనంతో వెల్లివిరియాలి. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి. గ్రామీణ ప్రజలందరూ తమ ఇండ్ల ముందు, ఇంటి ఖాళీస్థలాల్లో మొక్కలు నాటేలా చైతన్యపరచాలి. ఇందుకోసం అన్ని పల్లెల్లో ప్రతి ఇంటికీ ఆరు మొకల చొప్పున డోర్ టు డోర్ పంపిణీచేసి నాటించాలి.
–ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూలై 1 నుంచి పునఃప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. వీటిద్వారా గ్రామాలు, పట్టణాలను బాగా అభివృద్ధిచేయాలని, ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని పేర్కొన్నారు. పదిరోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత పల్లె, పట్టణప్రగతిలో భాగంగా నిర్దేశించిన ఏ పనికూడా అపరిష్కృతంగా ఉండటానికి వీల్లేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. పంచాయతీరాజ్‌శాఖకు ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తున్నదని, అయినప్పటికీ ఇంకా పనులు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయో అధికారులు పునఃసమీక్ష చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ప్రారంభం నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చదనంతో వెల్లివిరియాలి. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి.
గ్రామీణ ప్రజలందరూ తమ ఇండ్ల ముందు, ఇంటి ఖాళీస్థలాల్లో మొక్కలు నాటేలా చైతన్యపరచాలి. ఇందుకోసం అన్ని పల్లెల్లో ప్రతి ఇంటికీ ఆరు మొకల చొప్పున డోర్ టు డోర్ పంపిణీచేసి నాటించాలి’ అని ఆదేశించారు. పల్లెలు పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజావసరాలే ప్రాధాన్యంగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేదిశగా పాలనావ్యవస్థ రూపుదిద్దుకోవాలన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్దిలో జిల్లా కలెక్టర్లే కీలకమని, సమర్థమైన వరింగ్ టీంను తామే ఎంపికచేసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం సన్నాహక సమావేశాలను జిల్లా మండలాలవారీగా నిర్వహించాలని సీఎం సమీక్షలో తీసుకొన్న నిర్ణయాలను పటిష్ఠంగా అమలుచేసేందుకు కృషి చేయాలన్నారు.
అదనపు రైస్‌మిల్లులు తక్షణ అవసరం
‘తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందింది. వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలబడాలి. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. సాగునీటిపారుదల వ్యవస్థ పెరిగింది. ప్రజలు రెండు పంటలు పండిస్తున్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయింది. ప్రస్తుతం పండుతున్న ధాన్యాన్ని బియ్యంగా మార్పిడిచేయడానికి సరిపడా రైస్ మిల్లులు లేవు. అందువల్ల అదనపు రైస్ మిల్లుల ఏర్పాటు తక్షణ అవసరం. వెంటనే కొత్త రైస్ మిల్లులు ఏర్పాటుచేయాలి. వాటి సంఖ్యను పెంచాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
‘రాష్ట్రంలో పండిన పంటలను ప్రాసెస్ చేసి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు ఎగుమతిచేసే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌ఇజెడ్ (సెజ్)లను 250 ఎకరాలకు తకువ కాకుండా ఏర్పాటుచేయాలి. ఈ సెజ్‌ల చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటుచేసి, ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కల్తీ విత్తనాల అమ్మకాలను నిరోధించాలి
‘రాష్ట్రంలో కల్తీ విత్తన విక్రయాలను పూర్తిగా అరికట్టాలి. కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. కొన్ని చోట్ల విత్తనాలు మొలవవు, మొలిచిన మొలకలు సరిగ్గా ఎదగరు, పంట ఎదిగిన తరువాత దిగుబడి రాదు. రైతులు పెట్టుబడి పెట్టి కల్తీ విత్తనాలతో పంటల దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు. రైతుకు ఇబ్బంది కలుగకూడదనే పెట్టుబడి సహాయం రైతుబంధు ఇస్తున్నాం. కల్తీ విత్తనాల ద్వారా రైతులు నష్టపోతే మన రైతుబంధు ఇచ్చి కూడా లాభముండదు. రాష్ట్రంలో కల్తీ అనేది కనపడకూడదు. కల్తీ విత్తనాల అమ్మకందారుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు సమన్వయంతో కల్తీ విత్తనాల అమ్మకాలను పూర్తిగా అరికట్టాలి. రాష్ట్రంలో కల్తీ విత్తన విక్రయాల నిరోధానికి కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించండి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నేడు ఖాతాల్లోకి ప్రగతి నిధులు
గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విధిగా పంపే నిధులతోపాటు వైకుంఠధామాలు తదితర ప్రగతి పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేశామని, సోమవారం నాటికి ఖాతాల్లో జమవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖర్చుల కోసం నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో పదిరోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
శ్రమదానంతో కరెంటు సమస్యలు పరిష్కరించుకోవాలి
‘గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డేను పాటించాలి. ప్రజలను చైతన్యపరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి, కరెంటు సమస్యలను పరిషరించుకోవాలి. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం.. లే ఔట్లు పక్కా నిబంధనల ప్రకారం ఉండాలి. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిషరించడానికి సమగ్ర నివేదిక తయారుచేయాలి. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలి. అటవీ భూములను సంరక్షించాలి’ అని సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు, దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహమూద్‌అలీ, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అజయ్‌కుమార్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు, డీఎఫ్‌వోలు, కన్జర్వేటర్లు, డీపీవోలు తదితరులు పాల్గొన్నారు.