బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇదిగో జాబితా .. అదిగో జాబితా అని ఊరిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆషాఢం ముగియడంతో ఇప్పుడు మరోసారి అభ్యర్థుల జాబితా ప్రకటన అంశం తెరపైకి వచ్చింది. ముహుర్తాలకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే శ్రావణమాసంలో శుక్రవారం రోజున ఎన్నికలకు తొలి అడుగుగా మొదటి జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గతంలో అసెంబ్లీని రద్దు చేసిన రోజునే అభ్యర్థుల్ని కూడా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఈ సారి మాత్రం రాష్ట్ర రాజకీయాలు, నిర్ణయాలు, ప్రకటనలు అన్నీ కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహిస్తారని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆ జాబితాను విడుదల చేస్తారు. కేటీఆర్ గురువారం అమెరికాకు వెళ్లాల్సి ఉన్నా వాయిదా పడింది. కుమారుడిని గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లాలనుకున్నారు. కానీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో వాయిదా వేసినట్లుగా భావిస్తున్నారు.
ఫస్ట్ లిస్టును ఈనెల 18న విడుదల చేయడంలో ఏదేని పరిస్థితుల్లో చివరి నిమిషంలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చి వాయిదా పడాల్సిన అవసరం ఏర్పడితే ఈనెల 24న ఆ కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతనే కేటీఆర్ అమెరికాకు వెళ్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితాను విడుదల చేయడంలో కేసీఆర్ లక్కీ నెంబర్‌గా ఉండే ‘6’కు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే తొలి జాబితాలో అభ్యర్థుల సంఖ్య 66 లేదా 87 లేదా 96 లేదా 105 చొప్పున ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది దాదాపుగా కొలిక్కి వచ్చింది. వివాదం లేని స్థానాలన్నీ ఫస్ట్ లిస్టులో చోటుచేసుకుంటాయి… వారం పది రోజుల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులు తొలి జాబితా రెడీ అయిపోయిందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఓ జాబితా కూడా తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 80 మందికి పైగా అభ్యర్థులతో కూడిన జాబితాను త్వరలోనే ప్రకటించి..ప్రత్యర్థులకు సవాల్ విసిరేలా కేసీఆర్ ఇప్పటికే ఆయన కసరత్తులు చేస్తున్నారు.
ముహుర్తాలు, వాస్తు గట్టిగా నమ్మే కేసీఆర్ శ్రావణ మాసం ప్రారంభంలో ఆ జాబితాను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ లిస్ట్ లో సీఎం కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసే స్థానాలు కూడా ఉన్నాయి. చాలా వరకు సిట్టింగులకు అవకాశం కల్పించగా..కొన్ని చోట్ల కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు మొత్తం 78 మంది అభ్యర్థుల పేర్లతో ఉన్న లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అదంతా ఫేక్ అని.. అసలు ఎన్ని సీట్లలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారో తెలియదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.